అయోమయ ‘దేశం’ | It's an attitude rendukalla | Sakshi
Sakshi News home page

అయోమయ ‘దేశం’

Published Thu, Oct 3 2013 4:00 AM | Last Updated on Sat, Jul 28 2018 8:04 PM

It's an attitude rendukalla

సాక్షి, చిత్తూరు: రాష్ర్ట విభజన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగుతమ్ముళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆయన సొంత జిల్లాలో టీడీపీ శ్రేణులు సమైక్యాంధ్ర ఉద్యమంలో ముందుకు వెళ్లలేక, అధినేత ఇచ్చిన ‘గడపగడపకు తెలుగుదేశం’ పిలుపును స్వాగతించలేక అయోమయంలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి.  

విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వడంతో పాటు తాజాగా రాజధాని ఏర్పాటుపై ప్రకటనలు చేస్తుంటే ప్రజల్లోకి ఎలా వెళ్లాలని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ అనుభవం సాక్షాత్తు పార్టీ జిల్లా నా యకులకే అంతర్గత సమావేశాల్లో ఎదురవుతోంది. దీం తో వీరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరాలకే పరిమితమవుతున్నారు.
 
చిత్తూరులో జరుగుతున్న టీడీపీ దీక్షా శిబిరంలో మధ్యాహ్నం తరువాత ముఖ్యనాయకులు ఎవరూ కని పించడంలేదు. చిత్తూరు పట్టణంలో పార్టీ అధ్యక్షుడు జంగాలపల్లి, ఇతర నాయకులు కొద్దిసేపు కూర్చుని వెళ్లిపోతున్నారు. తిరుపతి నియోజకవర్గంలోనూ ఇదే పరి స్థితి. నియోజకవర్గ ఇన్‌చార్జి చదలవాడ అప్పుడప్పుడు శిబిరం వద్దకు వచ్చి ఉపన్యాసం ఇచ్చి వెళ్లడం మినహా నిర్దిష్టమైన ఆందోళన కార్యక్రమాలు ఇంతవరకు చేపట్టలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల ఉనికి సమైక్యాంధ్రలో అసలు లేదు. సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మేల్యే హేమలత కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటివరకు పాల్గొన్న దాఖలాలు లేవు.

ఈ నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు ఇంతవరకు రిలే దీక్షలు చేపట్టిన అనవాళ్లు లేవు. నగరి టీడీపీ ఎమ్మెల్యే పత్రికల్లో రోజూ ఎవరో ఒకరిమీద విమర్శలు గుప్పిం చటం మినహా పుత్తూరు, నగరి పట్టణాల్లో ఇంతవరకు ఆయన స్వయంగా పాల్గొన్న పెద్ద సమైక్యాంధ్ర ఆందోళన కార్యక్రమం ఒక్కటీలేదు. పార్టీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. తెలుగు తమ్ముళ్లు సమైక్యాంధ్రపై తమ పార్టీ వాణి అనుకూలమని చెప్పలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఎవరూ రోడ్లపైకి వచ్చి సమైక్యవాదులతో కలిసి ధైర్యంగా ఉద్యమాలు చేసే పరిస్థితి కనపడటం లేదు.

అన్నిచోట్ల రిలేదీక్ష పేరిట టెంట్లు వేసుకుని కాలం వెళ్లబుచ్చుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి ఇన్‌చార్జే లేకపోవటంతో ఇక్కడ అసలు సమైక్యాంధ్ర కోసం ఉద్యమించే టీడీపీ నాయకుడు లేడు. కార్యకర్తలు ఎవరికి వారు తమకెందుకులే అన్న ధోరణిలో ఉన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలోనూ టీడీపీ నాయకత్వ లోపం ఉండడంతో సమైక్యాంధ్ర ఉద్యమం గురించి ఇక్కడా మాట్లాడేవారు లేరు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకత్వ లోపం ఉంది. ఇక్కడ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. దీనికి తోడు కార్యకర్తలు సమైక్యాంధ్ర పేరిట జనం వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు.

మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో రెండవ శ్రేణి నాయకత్వం ఉన్నా వీరు తమకెందుకులే అన్నట్లు ఉంటున్నారు. ఇంతవరకు విభజనకు వ్యతిరేకంగా పెద్దగా టీడీపీ తరఫున ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. సీఎం ప్రాతి నిథ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలోనూ టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ కూడా నియోజకవర్గం స్థాయి లో పార్టీ శ్రేణులను ఉద్యమం వైపు నడిపించే నాయకులు లేరు. సమైక్య ఉద్యమంలో ధైర్యం చేసి ముందుకెళ్తే జేఏసీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనల వద్ద టీడీపీ వైఖరి చెప్పాలని నిలదీసే పరిస్థితి ఉంది. దీంతో జేఏసీ దీక్షా శిబిరాల వైపు టీడీపీ నాయకులు అసలు తొంగిచూడడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement