సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం అనంతపురం లలిత కళా పరిషత్తులో అభివృద్ధి వికేంద్రీకరణ-రాయలసీమ లో హైకోర్టు అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోస్తాలో రాజధాని ఏర్పాటు చేసినప్పుడు, రాయలసీమలో హైకోర్టు ఎందుకు పెట్టరని ఆయన ప్రశ్నించారు. అధికార వికేంద్రీకరణ, సామాజిక న్యాయంపై రాజకీయ పార్టీలు వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని, దానివల్లే పారిశ్రామిక రాయితీలు వస్తాయని ఐవైఆర్ అన్నారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. బెంగళూరు-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల సీమకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని, వెంటనే ఈ డిమాండ్‌ను కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు లక్ష్మణ్ రెడ్డి, రంగారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డు జడ్జి కృష్ణప్ప, జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు పాణ్యం సుబ్రమణ్యం, గోవిందరాజు, గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ పద్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment