మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సోదరుడు జగన్‌మోహన్ హత్యకేసు చిక్కుముడి వీడింది. జూలై17న దేవరకద్రలో హత్యకు గురైన ఎర్ర జగన్‌మోహన్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎమ్మెల్యే ఎం.చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ సోమవారం తన నలుగురు అనుచరులతో కలిసి జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ ఎదుట లొంగి పోయారు.
ఈ సందర్భంగా ఎస్పీ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. దేవరకద్ర మండలం సీసీకుంట సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎర్రశేఖర్ భార్య భవాని, తమ్ముడు జగన్‌మోహన్ భార్య అశ్రీత పోటీపడ్డారు. దీంతో ఆశ్రీతను పోటీ నుంచి తప్పించాలని ఎర్రశేఖర్ సోదరుడిని కోరాడు. అందుకు అతడు రూ.రెండులక్షలు, వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ టికెట్ ఇప్పించాలని డిమాండ్ చేశాడు. అంగీకరించిన ఎమ్మెల్యే.. జగన్‌మోహన్‌తోపాటు తన అనుచరులు తిమ్మన్న, రాములు, నర్సింహులు, సూర్యనారాయణ, రాజులను నామినేషన్ ఉపసంహరణకు కారులో దేవరకద్రకు పంపాడు.
అప్పటికే ఉపసంహరణకు సమయం మించిపోయింది. ఆగ్రహానికి గురైన ఎర్రశేఖర్.. వారందరినీ అక్కడే ఉండమని చెప్పి మహబూబ్‌నగర్ నుంచి ఒక్కడే దేవరకద్రకు వెళ్లాడు. అక్కడ ఓ హోటల్ వద్ద ఉన్న సోదరుడిపై తుపాకీతో మూడురౌండ్లు కాల్పులు జరపగా.. జగన్‌మోహన్ ప్రాణాలు విడిచాడు. అనంతరం ఎర్రశేఖర్ తన అనుచరులతో కలిసి పారిపోయాడు. కాగా, ఆదివారం ఎమ్మెల్యే అనుచరులు టి.తిమ్మన్న, దండు నర్సింహులు, టి.రాములు, బోనావత్ రమేష్ బాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య తామే చేశామని నిందితులు అంగీకరించారని ఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన పిస్తోల్, ఎమ్మెల్యే వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
సోదరుడి హత్య కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే
Published Tue, Aug 27 2013 8:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement