సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కాంగ్రెస్‌లో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. ‘నేర చరిత్ర కలిగిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌తో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేను.. ఆయనతో కలిసి వేదికను పంచుకోలేను’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు గురువారం జడ్చర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ రాయడం కలకలం సృష్టించింది. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సొంత పార్టీ నాయకులు విమర్శలు గుప్పించడం.. దీటుగా ఆయన స్పందించడం.. ఆ తర్వాత పార్టీలో క్రమక్రమంగా అసమ్మతి సెగలు రాజుకోవడం వంటి తదితర పరిణామాలతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీ దూకుడు పెంచడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి విధేయుడిగా ఉన్న అనిరుధ్‌రెడ్డి లేఖ సంధించడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఏడాదికిపైగా అనిశ్చితి..
మాజీ ఎమ్మెల్యే మరాఠి చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ గతేడాది జూలైలో బీజేపీని వీడారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన క్రమంలో ఆయనను కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జడ్చర్ల కాంగ్రెస్‌లో విభేదాలు గుప్పుమన్నాయి. నేరచరిత్ర కలిగిన ఎర్రశేఖర్‌ను పార్టీకి ఎలా చేర్చుకుంటారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధిష్టానానికి అప్పట్లో లేఖ రాయడంతో దుమారం చెలరేగింది. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో గతేడాది అక్టోబర్ 12న జరిగిన బహిరంగసభలో రేవంత్ సమక్షంలో చేరాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడింది. చదవండి: (మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్)
అనంతర కాలంలో శేఖర్‌పై ఉన్న కేసును కోర్టు కొట్టివేయడంతో కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైంది. ఈ ఏడాది జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో రేవంత్‌రెడ్డి తదితర నేతల సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత అటు అనిరుధ్‌రెడ్డి, ఇటు ఎర్రశేఖర్ వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపట్టిన దీక్షలో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క గత నెల 22న మహబూబ్‌నగర్‌కు వచ్చినప్పుడు ఆ ఇద్దరు వేర్వేరుగానే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా సుమారు ఏడాదికి పైగా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది.
సయోధ్య కుదిరినట్లేనని భావించినా..
తొలి నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలు కోమటిరెడ్డి ద్వారా ఎర్రశేఖర్ రాకను అనిరుధ్‌రెడ్డి అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో రెండు నెలల క్రితం అమెరికాలో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) సభలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితో పాటు అనిరుధ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య చర్చలు జరిగాయని.. సయోధ్య కుదిరినట్లేనని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అనిరుధ్‌రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాయడంతో మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. చదవండి: (కాంగ్రెస్‌లోకి కొత్తకోట దంపతులు?)
టీడీపీ వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నారంటూ..
‘పార్టీకి ఎవరూ అండగా లేని రోజుల్లో తాను శ్రమించానని.. కాంగ్రెస్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీలోకి దించి గెలిపించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించానని.. కానీ తన అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎర్రశేఖర్‌ను పార్టీలోకి తీసుకున్నారు.’ అని లేఖలో అనిరుధ్‌రెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చే వాళ్లకు ప్రాభవం లేకున్నా ప్రాధాన్యం ఇస్తున్నారని.. సీత దయాకర్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరుతున్నారని.. మొదటి నుంచి ఉన్న మాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సమంజసం కాదని.. తాను స్థానికుడిని అని ఏదిఏమైనా కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడుతానని, పార్టీ టికెట్ రాకున్నా పోటీలో ఉంటానని’ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ‘కోమటిరెడ్డి’ బాటలోనే అనిరుధ్‌రెడ్డి నడుస్తారా అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అనిరుధ్‌రెడ్డి లేఖపై కాంగ్రెస్‌లోని పలువురు నేతలు మండిపడుతున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి బంగ్ల రవి, ఎంపీటీసీల సంఘం నాయకుడు రాంచంద్రయ్య, నాయకులు రాజేశ్ తదితరులు నవాబ్‌పేటలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన తీరును ఖండించారు. అనతి కాలంలోనే ప్రజలకు చేరువ కావడంతోనే జీర్ణించుకోక ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరింతగా భగ్గుమనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment