
జగన్‌కు భయపడే విభజన : బీవీ రాఘవులు
విజయవాడ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో జగన్ ప్రభంజనం ముందు తమ పార్టీకి నూకలు చెల్లిపోతాయనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు విమర్శించారు. విజయవాడలో నిర్మించిన నండూరి ప్రసాదరావు శ్రామికభవన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం కోసమే కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందన్నారు.
రాజకీయ స్వార్థంతోనే తెలుగుజాతిని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. తెలుగుదేశం విభజనకు అనుకూలంగా మాట్లాడినందువల్లే కాంగ్రెస్ ధైర్యం చేసిందన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన ఎందుకోసమో చెప్పా లన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చిరంజీవి కోరటాన్ని ఎద్దేవా చేశారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న పార్టీల కార్యాలయాలకు తాళాలు వేస్తేనే విభజన నిర్ణయం వెనక్కు తీసుకునే అవకాశం ఉందన్నారు. నాయకులు పదవులకేగాక పార్టీలకు రాజీనామా చేసేలా ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు.