ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలుగుదేశం కూటమి అబద్దాలకు అంతు లేకుండా పోతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఇక అసత్యాలే గత్యంతరం అన్నట్లుగా ప్రచారాన్ని పెంచాయి. టీడీపీ భారీ ఎన్నికల వాగ్దానాలు చేసినా, జనం వాటిని నమ్మడం లేదు. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ పచ్చి మోసపూరిత ప్రచారానికి కూటమి దిగింది. ఫుల్ పేజీ ప్రకటనలే కాకుండా, అవే అబద్దాలతో ఈనాడు మీడియా పెద్ద ఎత్తున కథనాలు కూడా వండివార్చింది.
దీనికి ఒకటే కారణం కనిపిస్తుంది. సూపర్ సిక్స్ అంటూ టీడీపీ, జనసేనలు ఇచ్చిన హామీలు అయ్యేవి, పోయేవి కాదని ప్రజలు నిశ్చితాభిప్రాయానికి రావడమే. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల సందర్భంగా దాదాపు ఇవే తరహా వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నాయి. ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇచ్చిన మానిఫెస్టోలలోని వాగ్దానాలతో పాటు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న నవరత్నాలలోని అంశాలను జోడించి చంద్రబాబు కాపీ మానిఫెస్టోని తయారు చేసుకున్నారు. జగన్ ఇచ్చే స్కీముల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అందుకు అయ్యే వ్యయం ఎంతో మాత్రం టీడీపీ చెప్పడం లేదు.
ఆరు గ్యారంటీల అమలు సంగతేంటి?
ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ హామీలు ఎన్ని అమలు అవుతున్నాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. విశేషం ఏమిటంటే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం బీఆర్ఎస్ స్వీప్ చేస్తే, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ స్వీప్ చేసింది. తద్వారా అవసరమైన మెజార్టీకన్నా కాంగ్రెస్‌కు కొద్దిగా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఫలితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో చాలావరకు అమలు చేశామన్న అభిప్రాయం ప్రజలలో కలిగించడానికి గట్టి కృషి చేస్తున్నారు. రేవంత్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు, అలాగే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటివారు కార్నర్ చేస్తున్నారు.
నోరు జారిన రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నిర్మల్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. మహిళలకు ప్రతి నెల ఇస్తామని చెప్పిన 2500 రూపాయల హామీని అమలు చేసినట్లు చెప్పారు. దీనిపై కేసీఆర్ మండిపడ్డారు. నిజానికి కాంగ్రెస్ ఇచ్చిన మానిఫెస్టోలో అనేకం ఆచరణ సాధ్యం కానివని అప్పట్లో అందరూ గుర్తించినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అందుకు ప్రధాన కారణం కేసీఆర్ అనుసరించిన అహంభావ పూరిత ధోరణి అన్నది ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకుల అబిప్రాయం. పలు అబియోగాలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్లు ఇచ్చి ఆయన నష్టపోయారు. అది వేరే కథ.
ఏపీలో తెలుగుదేశం కూటమి అనేక వాగ్దానాలు చేసి ప్రజలను ఓట్లు అడుగుతోంది. జనం వాటిని నమ్మకపోవడంతో కొత్తగా లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అబద్దాలను సృష్టించి టీడీపీ కేసులలో చిక్కుకుంది. అయినా వదలకుండా అదే అంశంపై ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ స్త్రీలకు ఉచిత బస్ ప్రయాణం హామీని అమలు చేసింది. దీనివల్ల ఆర్టీసీకి వచ్చే నష్టాల సంగతి ఎలా ఉన్నా, అమలు వరకు ఓకే. కానీ దీని ఫలితంగా ఆటోలపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది చాలా నష్టపోయారు. మొదట వ్యక్తం అయినంత ఆశాభావ స్థితి ఇప్పుడు ఉన్నట్లు లేదు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లకు సబ్సీడీ వంటి స్కీములు అమలు చేసినట్లు చెబుతున్నా, ఎంతమందికి అవి అందుతున్నది చెప్పడం కష్టమే.
వంద రోజుల్లో వాగ్దానాలు అమలు..
ఎన్నికల ఫలితాలు వచ్చాక 2023 డిసెంబర్ తొమ్మిదిన రైతుబంధు నిధులను ఎక్కువ చేసి మరీ చెల్లిస్తామని పీసీసీ అధ్యక్ష హోదాలో ప్రకటించారు. ఆ తేదీన చెల్లించలేదు. ఎవరైనా అడిగితే ఇప్పుడేగా ప్రభుత్వం ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు దబాయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టేసిందని చెప్పేవారు. అయినా వంద రోజుల్లో అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని అనేవారు. ఆ వంద రోజులు దాటిపోయింది. కానీ చాలా వాగ్దానాలు అలాగే ఉండిపోయాయి. ఉదాహరణకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంశం తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో రాజకీయ పార్టీల మధ్య వాద, ప్రతివాదాలకు కారణం అవుతోంది.
రాజీనామాల సవాల్
మాజీ మంత్రి హరీష్ రావు ఈ హామీలు అమలు చేశారని రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు చేశారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ బదులు ఇస్తూ రుణమాఫీని ఆగస్టు పదిహేనులోగా చేస్తామని, హరీష్ రాజీనామాకు సిద్దంగా ఉండాలని అంటున్నారు. నిజంగా దీనికి అయ్యే వేల కోట్లు సిద్దం చేసుకుని అమలు చేస్తే రేవంత్‌కు రైతులలో మంచిపేరే వస్తుంది. కానీ చేయలేకపోతే ఎన్నికల కోసం చెప్పినట్లవుతుంది. కేసీఆర్ రైతు బంధు ఎకరాకు పదివేలు ఇస్తుంటే దానిని పదిహేను వేలు చేసి ఇస్తామని రేవంత్ ప్రకటించారు. కానీ ఆ ప్రకారం ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది.
విమర్శల వెల్లువ
కొంతమందికి పాత రైతు బంధు ప్రకారం డబ్బులు జమ అయినా, కాంగ్రెస్ చెప్పినట్లు మాత్రం జరగడం లేదు. అలాగే రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు చొప్పున ఇస్తామన్నది కాంగ్రెస్ వాగ్దానం. ఏఐసీసీ ప్రకటించిన లక్ష రూపాయల సాయానికి ఇది అదనమని రాహుల్ అన్నారు. అక్కడితో ఆగకుండా 2500 రూపాయల చొప్పున స్త్రీలకు చెల్లిస్తున్నట్లు రాహుల్ చెప్పడం విమర్శలకు దారి తీసింది.
కేసీఆర్ దీనిని అందుకుని రాహుల్ మాటల వీడియోని జనానికి వినిపించి విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇవ్వకపోగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వకుండా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నదని, అందరికీ రైతుబంధు జమ చేశామని ఒకసారి, ఇక నాలుగు లక్షల మందికే ఇవ్వాల్సి ఉన్నదని మరోసారి చెబుతూ కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ చెబుతోంది.
స్పష్టత ఇవ్వలేని అయోమయం
ఎన్నికల తరుణంలో కొంతవరకు ఈ డబ్బు వేసినట్లు తాజాగా అంటున్నారు. మరి రైతు రుణమాఫీని ఎలా చేస్తారు? ఎవరెవరికి వర్తింపజేస్తారు? విధివిధానాలేమిటి? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేని అయోమయం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ ఊరి వెళ్తే ఆ ఊరి దేవుళ్లు, దేవతల మీద ఒట్టు మీద ఒట్టు పెడుతూ రైతులను నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. రైతులు పండించిన పంటలకు రూ.500 బోనస్ హామీ బోగస్ ముచ్చటగా మిగిలిందని విపక్షం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ప్రియాంకాగాంధీ చేత యూత్ డిక్లరేషన్ ప్రకటింపజేసి అధికారంలోకి రాగానే మాట మార్చింది. అసలు తాము నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగ యువతను వెక్కిరించారు.
ఒట్టుల సీఎం..
రైతు రుణమాఫీపై రోజుకో దేవుడిపై ఒట్టు పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం నిర్మల్ జనజాతర సభలో మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా ఒట్టు పెట్టారు. ఎర్రవెల్లి జనజాతరలో మాట్లాడుతూ.. జోగుళాంబ అమ్మవారి సాక్షిగా ఒట్టు పెట్టారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ, ఈ నెల 9 లోపు రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని, రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం పరిశీలిస్తే అవి అర్ధ సత్యాలేనని తేలుతుంది. వృద్దులకు పెన్షన్ నాలుగువేల రూపాయలు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. కాని ఆ దిశగా ఇప్పటికీ అడుగులు పడలేదు. దళితులకు కేసీఆర్ పది లక్షల చొప్పునే ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల చొప్పున ఉపాది కల్పన స్కీము కింద ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. ప్రస్తుతం ఆ ఊసే రావడం లేదు.
కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి
కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు ఇచ్చిన పలు హామీల పరిస్థితి ఇలాగే ఉంది. అధికారం కోసం ఎన్నికలలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత కళ్లు తేలేయడం ఎక్కువ రాజకీయ పార్టీలకు అలవాటైంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు దేశంలోనే ఒక రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. 2014 ఎన్నికలలో లక్ష కోట్ల రైతుల రుణాలు, డ్వాక్ర మహిళల రుణాలు మాపి చేస్తామని చెప్పి ,చివరికి అరకొరగా చేసి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. అప్పట్లో కాపు రిజర్వేషన్‌లతో సహా 400 పైగా హామీలు ఇచ్చి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పదే,పదే గుర్తు చేస్తోందని మానిఫెస్టోని టీడీపీ వెబ్ సైట్‌లో నుంచి తొలగించారు.
వాగ్దానాల హామీ పూర్తి
2019లో విశ్వసనీయత దారుణంగా దెబ్బ తినడంతో చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. అదే సమయంలో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయి తాను ఇచ్చిన నవరత్నాల వాగ్దానాలను పూర్తిగా అమలు చేయడం ద్వారా ప్రజల ఆదరణ చూరగొన్నారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు, వృద్దుల ఇళ్లకే పెన్షన్‌లు, చేయూత, ఆసరా, విద్యా దీవెన తదితర పెక్కు హామీలను అమలు చేసి చూపించారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం బాదితులకు రక్షిత నీటి పథకం వంటివి నిర్మించారు.99 శాతం హామీలను తాను అమలు చేశానని, మీకు మంచి జరిగి ఉంటేనే తనకు మద్దతు ఇవ్వండని ధైర్యంగా జగన్ చెబుతున్నారు.
చంద్రబాబుకు పవన్ సరెండర్
అదే చంద్రబాబునాయుడు 2014 నుంచి 2019 వరకు బాగా పాలించానని, ఫలానా రకంగా వ్యవస్థలు మార్చానని, సంక్షేమం అందించానని చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం కొత్త, పాత మానిఫెస్టోలను చూపుతూ ప్రజల ముందుకు దైర్యంగా వెళ్లగలుగుతున్నారు. చంద్రబాబు అలా చేయలేకపోతున్నారు. చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయిపోయిన పవన్ కల్యాణ్ తన పార్టీ తరపున ఒక మానిఫెస్టోని కూడా తయారు చేసుకోలేకపోయారు. టీడీపీ మానిఫెస్టోనే భుజాన వేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ అయితే టీడీపీ, జనసేనల మానిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు ఆచరణ సాద్యం కాని హామీలు ఇచ్చినందునే తాము ఆ మానిఫెస్టోలో భాగస్వాములు కాలేదని బీజేపీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాధ బాబు తెలిపారు.
చంద్రబాబువి అన్నీ అబద్దాలే
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు ఏపీలో ప్రచారం చేసినా, టీడీపీ, జనసేనల మానిఫెస్టోకి మద్దతు ఇవ్వలేదు. అసలు ఆ ప్రస్తావనే తేలేదు. ముస్లిం రిజర్వేషన్‌ల వంటి అంశాలలో టీడీపీ మానిఫెస్టోలో క్లారిటీ ఇవ్వలేకపోయింది. తెలంగాణ, తదితర రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పిన బీజేపీ, ఏపీలో మాత్రం ఆ ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడుతూ డబుల్ గేమ్ ఆడుతోంది. మరో వైపు జగన్ తాను గతంలో ఇచ్చిన హామీలనే కొద్దిపాటి మార్పులతో కొనసాగిస్తామని ధైర్యంగా చెప్పారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన మానిఫెస్టోకి అసలు విలువ లేకుండా పోయింది. చంద్రబాబు అన్నీ అబద్దాలే చెబుతారన్న అభిప్రాయానికి ప్రజలు ఎక్కువ శాతం వచ్చారు.
అసత్యాల ప్రచారంతో రాజకీయ లబ్ది
తెలంగాణ, కర్నాటకలలో కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయడం విఫలం అవుతున్న మాదిరే ఏపీలో చంద్రబాబు కూడా అవేవి చేయలేడన్న స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. అందుకే రాష్ట్రంలొ చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద చల్లి, అసత్యాలు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. కానీ సోషల్ మీడియా వచ్చిన ఈ రోజులలో ఏ రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో ప్రజలు తెలుసుకుంటున్నారు .దాంతో చంద్రబాబు వంటివారి పప్పులు ఉడకడం లేదు. అందుకే చివరి అస్త్రంగా అబద్దాల మీదే చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామోజీ, రాధాకృష్ణలు ఆధారపడే దైన్య స్థితికి వచ్చారు.
కొమ్మినేని శ్రీనివాసరావు,
సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment