
జగన్‌కు న్యూడెమోక్రసీ నేతల మద్దతు
గుంటూరు వెస్ట్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీగుంటూరు జిల్లా కమిటీ సోమవారం పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రత్యేక హోదా కోరుతూ నగరంలో భారీ ప్రదర్శన జరిపింది. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన సభలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనని తెలిపారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని ఆయన తప్పుపట్టారు.
ప్రత్యేక హోదా సాధనకు ఆరు రోజుల నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష న్యాయమైనదని తెలిపారు. ఆ దీక్షను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు బలపరచాలని కోరారు. అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకలప్రసాద్, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ర్ట అధ్యక్షురాలు ఎన్.విష్ణు, పార్టీ నాయకులు ఇందుర్తి సుబ్బయ్య, నక్కా పోతురాజు, పీవో డబ్ల్యు నాయకురాలు పి.శివపార్వతి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.