
లబ్ధిదారుకు వసతి దీవెన కార్డు అందజేస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, తదితరులు
సాక్షి, విశాఖపట్నం: జగనన్న వసతి దీవెన! ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు తలపెట్టిన నవరత్నాల్లో ఇదొక హామీ! విద్యార్థుల ఉన్నత విద్యోన్నతే ఆయన ఉద్దేశం! ఒక్కరైనా ఉన్నత స్థాయికి ఎదిగితే వారి కుటుంబానికెంతో వెలుగు! పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ‘అమ్మ ఒడి’ అమలైంది. వాస్తవానికి ఉన్నత విద్యాకోర్సులు చదివే వారికే వసతి, భోజన ఖర్చుల నిమిత్తం రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని పాదయాత్రలోనే జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. తద్వారా జిల్లాలో 1,05,709 మందికి లబ్ధి చేకూరుంది. వారికి జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీ కార్యక్రమం జిల్లాలో సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. గ్రామ, వార్డు వలంటీర్లు మంగళవారం నుంచి ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు. వారి తల్లుల బ్యాంకు ఖాతాలో మొత్తం రూ.99.26 కోట్లు జమ అయ్యింది.
జగనన్న విద్యాదీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ (ఆర్‌టీఎఫ్) వర్తిస్తుంది. ఇక జగనన్న వసతిదీవెన పథకం విషయానికొస్తే ప్రతి విద్యారి్థకీ భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ కోర్సును బట్టి అందిస్తుంది. తొలి విడతలో 6,802 మంది ఐటీఐ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.3.40 కోట్లు, అలాగే 12,179 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.7,500 చొప్పున రూ.9.13 కోట్లు, డిగ్రీ ఆపై ఉన్నత విద్యాకోర్సులు చదివే 86,728 మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున రూ.86.73 కోట్ల మేర వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
జిల్లావ్యాప్తంగా సందడి...
భీమిలి మినహా జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సోమవారం జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. విశాఖ నగర పరిధిలోని తూర్పు, దక్షిణ, ఉత్తర, పశి్చమ, గాజువాక నియోజకవర్గాల పరిధిలోని విద్యార్థులకు కార్డుల అందజేత కార్యక్రమాన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు డీవీ రమణమూర్తి అధ్యక్షతన గురజాడ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్‌సీపీ నగర పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు
ప్రభుత్వ ధ్యేయం అక్షరాంధ్రప్రదేశ్..
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): రాష్ట్రాన్ని అక్షరాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధ్యేయమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో సోమవారం ‘జగనన్న వసతి దీవెన’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ‘దీవెన’ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో రాష్ట్రం పేరు మొదట్లో ఉంటుందని.. చదువులో కూడా అదేస్థానంలో ఉండేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలో ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులకోసం 30 శాతం మంది వెళ్తుంటే.. మన రాష్ట్రంలో 25 శాతం మంది మాత్రమే వెళ్తున్నారన్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. విద్యార్థి తనకు నచ్చిన కోర్సును ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేలా ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అమ్మవడి కోసం రూ.6500 కోట్లు, జగనన్న విద్య, వసతి దీవెన కోసం రూ.600 కోట్లు, ‘నాడు–నేడు’ కోసం రూ.7000 కోట్ల మేరకు బడ్జెట్ కేటాయించామన్నారు. బడ్జెట్‌లో నాలుగోవంతు విద్య కోసం కేటాయిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. పారీ్టలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల్ని అందిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యాన్ని పేదలకు చేరువచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు అన్నారు.
విశాఖను రాజధాని చేయాల్సిందే...
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది నేతలు రాజకీయం చేస్తున్నారని ఇది సరికాదని మంత్రి ముత్తంశెట్టి ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో ప్రయాణించాలంటే విశాఖను రాజధానిగా చేయడమే సరైనదని ఆయన అన్నారు. ఆ సమయంలో విశాఖను రాజధానిగా చేయాలని.. నినదిస్తూ సభా ప్రాంగణం హోరెత్తింది.
భారం తగ్గించారు...
మాకు ఇద్దరు అమ్మాయిలు. మొదటి అమ్మాయి సుప్రియను అతికష్టం మీద కళాశాలలో చదివిస్తున్నాం. రెండో అమ్మాయి చదువు సంగతి ఏమిటి.. అని ఆలోచిస్తున్న సమయంలో జగనన్న ఈ పథకంతో మాకు గొప్పభరోసా కలి్పంచారు. ఈ భరోసాతోనే ఈ ఏడాది రెండో అమ్మాయిని కళాశాలలో చేర్పించాం. ఆర్థికభారం లేకుండా ఇద్దరి ఆడపిల్లల్ని చదివించగలుగుతున్నామంటే అది సీఎం వైఎస్‌జగన్ చలవే. రుణపడి ఉంటాం.
– పినిశెట్టి దేవి
గొప్ప పథకం...
వసతి దీవెన మా లాంటి కుటుంబాలకు చాలా ఉపయోగపడుతుంది. ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు ధైర్యాన్ని అందించారు. చదువుకోవాలని ఆకాంక్ష ఉంటే చాలు. ఇలాంటి ప్రభుత్వాల వలన ప్రజలకు మేలు జరుగుతుంది. హ్యాట్సాఫ్ టు
జగనన్న.
– కొల్లి కుమారి
ఉన్నత చదువుకు..
నాడు ముఖ్యమంత్రి గా రాజశేఖరరెడ్డి చదువులకు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి ప్రోత్సహిస్తే నేడు ఆయన కుమారుడు జగన్‌మోహనరెడ్డి హాస్టల్ ఖర్చులను సైతం ప్రోత్సాహంగా అందించి చదువును మరింతగా ప్రోత్సహించడం నిజంగా గొప్ప విషయం. మా అబ్బాయి పాలిటెక్నికల్ చదువుతున్నాడు. మాకు ట్రెజరీ నుంచి మెసేజ్ వచ్చింది.
– గట్రెడ్డి రాణి, కొత్తకోట
Comments
Please login to add a commentAdd a comment