రికార్డు స్థాయిలో బెల్లం లావాదేవీలు
కళకళలాడిన మార్కెట్ యార్డు ఈ సీజన్‌కు ఇదే అత్యధికం
మొదటిరకం క్వింటా రూ. 3వేలు
అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో మంగళవారం రికార్డుస్థాయిలో లావాదేవీలు సాగాయి. అమ్మకం, కొనుగోలుదారులతో యార్డులన్నీ కళకళలాడాయి. మార్కెట్‌కు 57,455 దిమ్మలు వచ్చాయి. మొదటిరకం క్వింటా రూ. 3 వేలు ధర పలికింది. దిగుమతి, ఎగుమతి వర్తకుల వేలంపాటలతో అంతటా సందడి నెలకొంది. ఈ సీజన్ ప్రారంభంలో బెల్లం లావాదేవీలపై హుద్‌హుద్ ప్రభావం గట్టిగానే కనిపించింది. అయినా రైతులు పెద్ద మొత్తంలో బెల్లాన్ని తయారు చేశారు. ఈక్రమంలో గతేడాది డిసెంబర్ 29న 32,644 దిమ్మలు, ఈ నెల 12న 37,431 దిమ్మలు అత్యధికంగా మార్కెట్‌లో లావాదేవీలు సాగాయి.
మంగళవారం ఏకంగా అరలక్షకు పైబడి దిమ్మలు రావడంతో ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మొదటిరకం క్వింటా రూ. 3వేలు ధర పలికింది. రైతులకు పరవాలేదనిపించింది. వాస్తవానికి ఈ నెల 7న బెల్లం మార్కెట్‌లో మొదటిరకం రూ.3340లు పలకగా,సంక్రాంతి ముందు రోజు గణనీయంగానే బెల్లం ధర పడిపోయింది. ఈదశలో లావాదేవీలు నాలుగోవారం పుంజుకోవడం మార్కెట్ వర్గాలకు ఉత్సాహాన్ని నింపింది. అనకాపల్లి మార్కెట్ నుంచి బెల్లం కలకత్తా, ఒడిశా తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నప్పటికీ, తెలంగాణకు సరఫరా అయ్యే బెల్లం విషయంలో ఎదురవుతున్న సవాళ్లు ధరలను ప్రభావితం చేస్తున్నట్టు ఇక్కడి వర్తకులు చెబుతున్నారు.