గుంటూరు ఈస్ట్: విద్యుత్ చౌర్యం సాంఘిక నేరం కింద పరిగణిస్తున్నారు. కొందరు అడ్డదారిలో అతి తెలివితేటలు ఉపయోగించడంతో విద్యుత్ చౌర్యానికి పాల్పడితే విద్యుత్ సంస్థ నష్టాలపాలవుతుంది. ఫలితంగా ఆ నష్టాన్ని వినియోగదారులే పెరిగిన చార్జీల రూపంలో భరించాల్సి వస్తోంది. విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చోరులను కటకటాల వెనక్కి పంపుతున్నారు.
నేరుగా వైరు వేస్తే జైలే..
నేరుగా వైరు తగిలించడం ప్రమాదం. కనెక్షన్ లేకుండా నేరుగా హైటెన్షన్ తీగలపై వైర్లు తగిలించి విద్యుత్ వాడుకుంటున్న కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో విద్యుత్ ఘాతాలకు గురై ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
మీటర్‌ను బైపాస్ చేయడం..
అనేక పద్ధతుల ద్వారా మీటర్‌ను తిరగకుండా చేస్తున్నారు. కొందరు మీటర్‌కు లేదా సర్వీసు వైర్‌కు ఒక స్విచ్ ఏర్పాటు చేసి విద్యుత్ సిబ్బంది పరిశీలనకు వచ్చేటప్పుడు మీటర్ తిరిగేటట్లుగా ఉంచుతున్నారు. వారు వెళ్లిపోయిన తరువాత స్విచ్‌ను వినియోగించి ఫ్రిజ్, ఏసీ తదితర ఏలక్ట్రానిక్ సామగ్రి వినియోగం మీటర్‌లో నమోదు కాకుండా చేస్తున్నారు. అయితే ఇటువంటి ఏర్పాట్లు ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్‌కు కారణమవుతున్నాయి. నాజ్ సెంటర్‌లోని ఓ వ్యాపారి మీటర్‌కు స్విచ్ ఏర్పాటు చేసి లక్షల్లో అపరాధ రుసుం చెల్లించుకున్నాడు.
కనెక్షన్ ఇంటికి, వాడకం వాణిజ్యానికి..
గుంటూరులోని ప్రఖ్యాత లిమిటెడ్ సంస్థ గెస్ట్ హౌస్ కోసం తీసుకున్న కనెక్షన్‌ను వ్యాపార అవసరాలకు వాడుకోవడంతో విద్యుత్ అధికారులు పట్టుకుని లక్షల్లో అపరాధ రుసుం విధించారు. గృహ వినియోగానిని తీసుకున్న కనెక్షన్ వ్యాపారం లేదా పరిశ్రమల కోసం వినియోగిస్తే లాభపడిన దానికన్నా ఎక్కువ రెట్లు మొత్తం అపరాధ రుసుంగా చెల్లించాల్సి ఉంటుంది.
అధిక లోడు..
మీటరు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు పేర్కొన్న విద్యుత్ ఉపకరణాలకన్నా ఎక్కువ ఉంటే వెంటనే మీ సేవ ద్వారా నమోదు చేయించుకోవాలి. లేదంటే ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏర్పాటు చేసిన మోడెమ్‌ల ద్వారా ఈ సమాచారం తెలుస్తుంది. పెరిగిన వినియోగానికి తగ్గట్టుగా వైర్లు మార్చుకోవాలి. లేదంటే విద్యుత్ ఘాతాలు జరిగే ప్రమాదం ఉంది.
విద్యుత్ చౌర్యంసాంఘిక నేరం
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే సెక్షన్ 139 ప్రకారం భారీగా అపరాధ రుసుంతోపాటు మూడేళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉంది. వినియోగదారుల్లో మార్పు రావాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించినప్పుడే విద్యుత్ చౌర్యం తగ్గుతుంది. విద్యుత్ చౌర్యం చేసేవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించాం. : సురేష్‌కుమార్ ఎస్‌ఈ,విద్యుత్ చౌర్య నిరోధక విభాగం,తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment