దోచుకోవడమే వారి సింగిల్‌ అజెండా | Jakkampudi Raja Slams Chandrababu naidu | Sakshi
Sakshi News home page

దోచుకోవడమే వారి సింగిల్‌ అజెండా

Published Mon, Nov 19 2018 8:34 AM | Last Updated on Mon, Nov 19 2018 8:34 AM

Jakkampudi Raja Slams Chandrababu naidu - Sakshi

రావాలి జగన్‌ – కావాలి జగన్‌ ముగింపు సభలో ప్రసంగిస్తున్న జక్కంపూడి రాజా

తూర్పుగోదావరి, సీతానగరం (రాజానగరం): ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సింగిల్‌ ఎజెండాగా పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సీతానగరం మండలం రఘుదేవపురంలో నిర్వహించిన రావాలి జగన్, కావాలి జగన్‌ ముగింపు సభ ఆదివారం జరిగింది. జక్కంపూడి రాజా, పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ మార్గాని భరత్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాజా మాట్లాడుతూ అధికార టీడీపీ ఆర్థికంగా బలంగా ఉన్న వర్గాల కోసం పాటుపడుతోందని, జగన్‌ మాత్రం బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం పాదయాత్ర జరుపుతున్నారని గుర్తు చేశారు. టీడీపీ పరిపాలనలో వైఎస్సార్‌ సీపీకి చెందినవారికి సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 2014 ఎన్నికలలో 650కు పైగా వాగ్దానాలు చేసి, ఏ ఒక్క హామీని అమలుపర్చకుండా చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గ ఎమ్మెల్యేకు చంద్రబాబు నూటికి పదమూడు మార్కులు ఇచ్చారని, ఇసుక, మట్టిని దోచుకుంటూ రూ.వందల కోట్లు దోచేసి ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టారని అన్నారు.

కాటవరం, తొర్రిగడ్డ, పురుషోత్తపట్నం, పుష్కర, చాగల్నాడు పథకాలలో ఏ ఒక్కటి పనిచేయకుండా రైతులకు నీరందించలేని ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్న విశాఖకు నీరందించడానికి శ్రద్ధ చూపడం విడ్డూరంగా ఉందన్నారు. విద్య, పారిశ్రామిక, వ్యవసాయ, ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని, ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేకపోవడంతో వెనుకబడి ఉన్నామని అన్నారు. ఎంపీ మురళీమోహన్‌ తనకు ఏదైనా పని ఉంటే వస్తారని, ప్రజల అవసరాలు తీర్చడానికి మాత్రం కనిపించరని ఎద్దేవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చవలసిన అవసరం ఉందని వివరించారు. మార్గాని భరత్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ పాలన చూడాలంటే వైఎస్సార్‌ సీపీని బలపర్చాలన్నారు.

పార్టమెంట్‌ నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, దోచుకోవడమే ధ్యేయంగా పాలన జరిపారన్నారు. వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేశారన్నారు. నియోజకవర్గం వెనుకబడి ఉందని, జగన్‌ ముఖ్యమంత్రి అయిన తక్షణమే నియోజకవర్గాన్ని నో వర్క్‌ జోన్‌గా తయారు చేస్తామని అన్నారు. అలాగే నవరత్నాలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల అయిదు పార్టమెంట్‌ నియోజకవర్గాల రీజనల్‌ ఇన్‌చార్జి బీవీఆర్‌ చౌదరి మాట్లాడుతూ పార్టీ విజయానికి బూత్‌ కమిటీలు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ పెదపాటి డాక్టర్‌ బాబు, పార్టీ నాయకులు వలవల రాజా, చల్లమళ్ళ సుజీరాజు, పిచ్చుకుల విజయ్‌ కుమార్, కోండ్రపు ముత్యాలు, పట్టపగల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement