సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, కడప, అనంతపురం ఉన్నాయని మద్యపాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన్ పి.లక్ష్మణరెడ్డి అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. జిల్లాలోని పబ్లిక్ లైబ్రరీలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓకే ప్రాంతం అభివృద్ధిగా అడుగులు వేస్తే భవిష్యత్తులో వేర్పాటువాద ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాజధాని కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అవసరం అవుతుంది. అంత పెద్ద మొత్తం ఒకే చోట వెచ్చించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: వికేంద్రీకరణతోనే సమాజ ప్రగతి
విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తే కేవలం ఐదు నుంచి పది వేల కోట్లతో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని లక్ష్మారెడ్డి వివరించారు. విశాఖకు ఉన్న నైసర్గిక స్వరూపాన్ని బట్టి రాజధానిగా ఏర్పాటు చేస్తే.. ప్రపంచంలోనే ఉన్నత స్థాయి నగరంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో అమరావతి గ్రాఫిక్ చూపించి కోట్లాది రూపాయల విలువ చేసే భూములను కొందరు స్వాధీనం చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి అంటే భూముల విక్రయం, విలువ ద్వారా సాధ్యం కాదని లక్ష్మణరెడ్డి తెలిపారు.
అదేవిధంగా ఈ సదసస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ కేసీ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి ఎప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా చేయాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రింగ్ రోడ్డు నిర్మించినప్పుడు కొందరు నవ్వారని.. ఇప్పుడు అది హైదరాబాద్ ప్రజలకు జీవనాధారం అయిందని గుర్తు చేశారు. పేరుకు అమరావతి రాజధాని అయినా రాజధాని ఎక్కడో దూరంగా ఉందన్నారు. శివరామకృష్ణన్ కమిటీలో ఎక్కడా అమరావతి ప్రస్తావన లేదని ప్రొఫెసర్ కేసీ రెడ్డి తెలిపారు. చాలా కమిటీ నివేదికల్లో అమరావతి రాజధాని నిర్మాణం వలన ఇబ్బందులు ఉన్నాయని ప్రస్తావించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. విశాఖను అభివృద్ధి చేయలన్నది సీఎం జగన్ ఆలోచన అని.. విశాఖ ప్రజలు అభివృద్ధి ఎవరు చేసినా ఆహ్వానిస్తారని ప్రొఫెసర్ కేసీ రెడ్డి తెలిపారు.
ఈ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ.. 1953లోనే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన జరిగిందని ఆయన గుర్తు చేశారు. నర్మదా, గోదావరి నదుల జలాలు విశాఖ తూర్పు కనుమల్లోని నీరని అన్నారు. గోదావరి జిల్లాలో రెండో పంటకు సీలేరు నీరే ఆధారమని ఆయన చెప్పారు. గోదావరి పుష్కరాలలో నీరు లేనప్పుడు.. చంద్రబాబు నాయుడు స్నానం చేసిన నీరు సీలేరు నుంచి విడిచిపెట్టినవని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రుల రాజధానిగా అమరావతి, కర్నూలు, విశాఖను అభివృద్ధి చేస్తే అభ్యంతరాలు ఏమిటని ప్రొఫెసర్ కేఎస్ చలం ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్రలో ఉన్నాయని.. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు నిర్ణయాన్నిఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని కేఎస్ చలం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment