సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పంపించిన విభజన బిల్లును తిప్పి పంపించే అధికారం ముఖ్యమంత్రికి ఉందా? అది రాజ్యాంగ విరుద్ధమా, కాదా? సభ్యుల అభిప్రాయాలు తెలుపకుండా దానిని పంపించటానికి వీలుందా? అలాంటి హక్కు ఈ సభకు ఉందా? అనే అంశాలపై స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని మంత్రి జానారెడ్డి శనివారం అసెంబ్లీలో కోరారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందా లేదా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని ఎంఐఎం నేత ఒవైసీ కోరారు.
దీనిపై స్పీకర్ మనోహర్ స్పందిస్తూ.. ‘‘పార్లమెంటుకు అధికారాలు, బాధ్యతలు ఉన్నట్లే.. శాసనసభకు కూడా రాజ్యాంగం అధికారాలు, హక్కులు కల్పించింది. నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలి. ఇలాంటి పరిస్థితులు గతంలో రాలేదు. మూడో అధికరణ ప్రకారం బిల్లు వస్తే ఏమి చేయాలన్నది ఏమీ లేదు. కొన్ని రాష్ట్రాల్లో అనుసరించిన విధానం పరిశీలించి సభ్యులకు నోట్ అందజేశాం. అక్కడి పద్ధతి ఇక్కడ అనుసరించాలని లేదు. ఈ సభ స్వతంత్రమైనది. బీఏసీ నిర్ణయం మేరకు ముందుకెళ్దాం. సభ్యుల అభిప్రాయం మేరకు నడుచుకుంటాం. ఈ చర్చ సందర్భంగా సీఎం, ప్రతిపక్ష నాయకుడు, సభ్యులు విలువైన సమాచారాన్ని ఇచ్చారు. బిల్లుపై సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించాలి. సభకు పూర్తి స్వాతంత్య్రాన్ని గుర్తిస్తూనే.. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి’’ అని పేర్కొన్నారు.