
'జానా, ఉత్తమ్‌కుమార్‌లది దొరల అహంకారం'
హైదరాబాద్ : జాతీయ జెండా ఎగురవేయని తెలంగాణ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రారావు డిమాండ్ చేశారు. కొంతమంది తెలంగాణ మంత్రులు తెలుగు జాతిని అవమానపరుస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డిలది దొరల అహంకారమని గట్టు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారిద్దరూ మంత్రులుగా ఉండే అర్హత కోల్పోయారన్నారు. తెలంగాణ ఏర్పడితే దొరల రాజ్యం వస్తుందే కానీ మరొకరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ జిల్లాల్లో జాతీయ జెండా ఎగురవేసే ఇతర ప్రాంతాల కలెక్టర్లను కూడా అరెస్ట్ చేయిస్తారా అని గట్టు ప్రశ్నించారు.
102 సంవత్సరాల తెలుగువారి ఆకాంక్షే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు అని గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణ ఉన్న మంత్రులు తమ పదవులు చేపట్టినప్పుడు రాజ్యాంగానికి బద్ధులమై ఉంటామని రాజ్యాంగంపై ప్రమాణం చేసి......వారు జాతీయ జెండాను ఆవిష్కరించకపోవటం తెలుగుజాతిని, భారతదేశాన్ని అవమానించటం కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ అంటూ కోతలు కోస్తున్న నేతలు గతంలో ఏవిధంగా ప్రవర్తించారో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.