
తిరుమలలో కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
తిరుమల: మూడు రాజధానుల యోచనను జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సమర్థించారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదుపరి ఆలయం వెలుపల రాపాక మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయం సబబేనన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాల్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గత ప్రభుత్వం అమరావతిలో రైతుల భూముల్ని బలవంతంగా లాక్కుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఇబ్బందేనని, అమరావతి రైతులను సర్కారు ఆదుకోవాలని కోరారు. నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతిస్తామని.. చెడు
చేస్తే వ్యతిరేకిస్తామని చెప్పారు.