సాక్షి, రాజోలు(తూర్పు గోదావరి): జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాక రాజోలులో హైడ్రామా నెలకొంది. రాపాక పోలీసులకు లొంగిపోయిన వెంటనే జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యే మద్దతుదారులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ బయట బైఠాయించారు. అనంతరం రాపాకను రాజోలు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. పోలీసులు ఎంత వారించినా వారు వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాపక తన మద్దతుదారులతో కలిసి రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు . దీంతో కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు చివరికి ఎమ్మెల్యేను కోర్టుకు తరలించారు.
ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్న తొమ్మిది మందిని మలికిపురం ఎస్సై కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంపై రాపాక అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అంతటితో అగకుండా రాపాక తన అనుచరులతో కలిసి పోలీస్ స్షేషన్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మరోవైపు జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయవచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఒకవేళ ఎస్‌ఐ తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment