సాక్షి ప్రతినిధి, ఏలూరు : జనసేన పార్టీ వివాదాల సుడిలో చిక్కుకుంది. పార్టీలో సీట్లు అమ్ముకున్నారని పోలవరం నియోజకవర్గ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం అసెంబ్లీ జనసేన అభ్యర్థి సిర్రి బాలరాజు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో రూ.2 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అటువంటి అవినీతిపరుడైన వ్యక్తికి సీటు ఎలా ఇచ్చారని జనసేన పార్టీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కమిటీ ఏపీ, తెలంగాణ వైస్ చైర్మన్ దువ్వెల సృజన నిలదీశారు. జనసేన నేత కరాటం సాయి పోలవరం టికెట్‌ను సిర్రి బాలరాజుకు డబ్బులు చెల్లించి తీసుకువచ్చారని ఆమె చెప్పారు. చాలాకాలంగా పార్టీలో ఉన్న తాను ఆ సీటు కోసం ప్రయత్నించానని, తనను రూ.50 లక్షలు అడిగారని సృజన తెలిపారు. అయితే ఆ తర్వాత కరాటం సాయి బాలరాజుకు సీటు ఇప్పించారన్నారు. జనసేన పార్టీ మేనిఫెస్టోలో అవినీతి లేకుండా రాజకీయం చేస్తామంటూ అవినీతిపరుడికి టికెట్ ఎలా ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు చెబుదామంటే అవకాశం ఇవ్వలేదన్నారు. కరాటం ఫ్యామిలీ వల్ల పోలవరం స్థానాన్ని కోల్పోవలసి వస్తోందని సృజన మండిపడ్డారు.
తణుకులో ఆరని చిచ్చు
మరోవైపు తణుకు నియోజవర్గంలోని జనసేన పార్టీలో తలెత్తిన విబేధాలు చల్లారలేదు. పార్టీ టికెట్ ఆశించి భంగపడిన విడివాడ రామచంద్రరావు రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం భీమవరం విచ్చేసిన పవన్‌కల్యాణ్‌ను కలిసిన విడివాడకు ఆయన నుంచి సానుకూలత రాకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో లోపాయకారీ పొత్తు ఉండడం వల్లే జనసేన తనకు టికెట్ కేటాయించలేదని విడివాడ ఆరోపించారు. తాను పార్టీ ప్రారంభమైన నాటి నుంచి నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకున్నానని, ఇప్పుడు టీడీపీ సూచనతోనే వేరే అభ్యర్థిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం బరిలో టీడీపీ రెబల్ అభ్యర్థి
పోలవరం తెలుగుదేశం పార్టీలో కూడా అసమ్మతులు ఆగడం లేదు. పోలవరం అసెంబ్లీ టీడీపీ రెబల్ అభ్యర్థిగా వంకా కాంచనమాల శుక్రవారం నామినేషన్ వేశారు. వంకా కాంచనమాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు కుమార్తె. పోలవరం నుంచి టికెట్‌ను ఆశించిన వారిలో కాంచనమాల ఒకరు. అయితే కాంచనమాలకు టికెట్ దక్కకపోవడంతో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరోవైపు నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడిని బుజ్జగించేందుకు తెలుగుదేశం అధిష్టానం విశ్వప్రయత్నం చేస్తోంది. గురువారం మంత్రి పితాని సత్యనారాయణ, నరసాపురం ఎంపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు వెళ్లి కొత్తపల్లికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనికి కొత్తపల్లి సుబ్బారాయుడు ససేమిరా అన్నట్లు సమాచారం. చంద్రబాబునాయుడితో మాట్లాడించి బుజ్జగించాలన్న ప్రయత్నం చేస్తున్నారు. చింతలపూడిలో మాజీ మంత్రి పీతల సుజాత వర్గం సహాయ నిరాకరణ చేస్తోంది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి సమావేశానికి కూడా పీతల సుజాత గైర్హాజరయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు నెంబర్–1 అని ప్రకటించి కొద్ది నెలలకే పదవి నుంచి తప్పించారని, అలాగే నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుంచానని పొగడ్తలు కురిపించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతల మాటలు విని తనకు సీటు లేకుండా చేశారని సుజాత ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆమె వర్గం పూర్తిగా సహాయనిరాకరణ చేస్తోంది. మరోవైపు మాల సామాజిక వర్గం నేతలు కూడా సుజాతను చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment