
చిట్టివలస జూట్‌మిల్లులో పర్యటిస్తున్న జనసేనాని పవన్‌కల్యాణ్
సాక్షి, తగరపువలస(భీమిలి): విశాఖ జిల్లాలో భీమిలి సహా ఇతర భూ కుంభకోణాలకు మంత్రి గంటా శ్రీనివాసరావు అతని అనుచరులే బాధ్యత వహించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. సింహాచలం పంచగ్రామాల సమస్యలో రైతులు, కోర్టుకు మధ్య సయోధ్య కుదిర్చి అక్కడి వారికి న్యాయం చేయాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం తగరపువలస అంబేడ్కరు కూడలిలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ముదపాకలో దళిత మహిళ అని చూడకుండా ఈడ్చికొట్టి వివస్త్రను చేసిన సంఘటనలో టీడీపీ వైఖరి వెల్లడైందన్నారు. ఉత్తరాంధ్రలో 369 కిలోమీటర్ల పొడువున తీరప్రాంతం ఉందని కానీ దివీస్ లాంటి పరిశ్రమల వల్ల 23 రకాల చేప జాతులు అంతరించి పోయాయన్నారు. వీరికి కనీసం జెట్టీలు, బోట్లు లేకపోగా వేట విరామ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించలేకపోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ గూండాలు అడ్డదారులు తొక్కుతారని దీనిని జనసేన సైనికులు అడ్డుకోవాలని సూచించారు.
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇచ్ఛాపురం నుంచి భీమిలి వరకు ఉత్తరాంధ్రలో ఉన్న అనేక సమస్యలపై పోరాటానికే తాను గంగమ్మ స్నానం చేసి పర్యటిస్తున్నానన్నారు. విశాఖ రైల్వేజోన్‌పై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదన్నారు. జోనూ లేదు గీనూ లేదు అని అవంతి శ్రీనివాసరావు అంటే ఐదు కిలోలు తగ్గడానికి ఒక్కరోజు దీక్ష చేస్తానని మురళీమోహన్ అనడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు. ఇలాంటి వారికి గత ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిపించినందుకు బాధపడుతున్నానన్నారు. కాపు రిజర్వేషన్లపై నాటకా లాడకుండా చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలన్నారు. జాతీయరహదారులకు ఇరువైపులా టీడీపీ నాయకులకు భూములు ఉన్నందునే రోడ్లయినా వేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేథరిన్ విద్యాసంస్థల డైరెక్టర్ ఆలీవర్ రాయి పవన్‌ను సత్కరించారు.
గంటాకు మద్దతు ఇచ్చి బాధపడుతున్నా
గత ఎన్నికల సమయంలో చిట్టివలస జూట్‌మిల్లు లాకౌట్ సమస్య తనకు తెలియకపోవడంతో మంత్రి గంటా శ్రీనివాసరావుకు మద్దతు తెలియజేశానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన జూట్‌మిల్లులో పర్యటించిన అనంతరం మిల్లు ఎదుట కార్మికసంఘాలు, కార్మిక కుటుంబాలతో సమావేశమయ్యారు. లక్ష మంది ప్రజలు పరోక్షంగా లాకౌట్‌తో రోడ్డున పడ్డారన్నారు. మిల్లు సమస్య అర్ధం చేసుకోవడానికి మరోసారి కార్మికసంఘాలతో నగరంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమై లాకౌట్ పరిష్కారానికి దిశానిర్ధేశం చేస్తామన్నారు. కార్మికసంఘాల నాయకులు అల్లు బాబూరావు, కొండపు ఈశ్వరరావు, ఆర్.ఎస్.ఎన్.మూర్తి, నాగోతు అప్పలరాజు, చిల్ల వెంకటరెడ్డి వినతిపత్రం అందించారు.