నేడు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రద్దు
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లవలసిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806)ను బుధవారం (9వ తేదీ) రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కే సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ రావలసిన రైలు మంగళవారం రద్దు కావడంతో బుధవారం నాటి సర్వీసును రద్దు చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే, బుధవారం సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లవలసిన విశాఖ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.
గూడ్స్ రైళ్లను నియంత్రించండి : ద.మ. రైల్వే జీఎం
సీమాంధ్ర ప్రాంతంలో బస్సులు నడవడంలేనందున రైళ్లనే నమ్ముకున్న ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే మిట్టల్ ఆదేశించారు. సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రైళ్లకు అంతరాయం లేకుండా చూసేందుకు గూడ్స్ రైళ్లను నియంత్రించాలని సూచించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో మంగళవారం ఆయన దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని ప్రధాన విభాగాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.