జన్మభూమి మూడో విడత ప్రారంభం కానుంది. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు ఇందులో భాగంగా గ్రామసభలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. గత రెండు విడతలుగా జన్మభూమి నిర్వహించినా ఏఒక్క సమస్యా పరిష్కారం కాలేదని జనం పెదవి విరుస్తున్నారు. దీంతో వీరంతా సమస్యలతో నిలదీతకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలోని 1109 గ్రామపంచాయతీలతోపాటు శివారులోనూ గ్రామసభలు జరగనున్నాయి. రోజుకు నాలుగు గ్రామాల వంతున మండలాల వారీగా నిర్వహించే ఈ సభలను ఈసారి డివిజన్‌కు ఒక ఐఎఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు పర్యవేక్షించనున్నారు.
శ్రీకాకుళం టౌన్
రెండు విడతల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో 51,698 వినతులు పరిష్కారానికి నోచుకోలేదని అధికార గణాంకాణాలే చెబుతున్నాయి. అంటే లక్షకు పైగా పిటిషన్లు బుట్టదాఖలయ్యాయి. గ్రామాల్లోనే కొన్ని అర్జీలను విడిచిపెట్టిన ఉదంతాలున్నాయి. ప్రధానంగా క్షేత్రస్థాయి సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో వ్యక్తిగత పిటిషన్లే అధికంగా ఉన్నాయని అధికారులంటున్నారు.
ప్రభుత్వం ఈపాస్ విధానంతో అనేక మందికి రేషన్ కార్డులను తొలగించారు. కొన్నింటికి వేలి ముద్రలు పడడం లేదని, మరికొన్ని ఐరిస్ జతకావడం లేదని కారణం చూపుతూ రేషన్ ఇవ్వని పరిస్థితి నెలకొంది. 20వేల కుటుంబాలకు డిసెంబరులో ఈ కారణాలతో రేషన్ ఇవ్వలేదు. దీనికి తోడు అంత్యోదయ కార్డులను తెల్లరేషన్ కార్డులుగా మార్చి ఏకార్డుపైనా రేషన్ సరఫరా నిలిపివేశారు. దీనివల్ల లక్ష కుటుంబాలకు రెండునెలలుగా రేషన్ సరకులు అందకుండా పోయాయి.
40వేలమందికి పెన్షన్లు తొలగించారు. అనర్హులుగా ప్రకటిస్తూ పెన్షను నిలిపేశారు. వయోవృద్ధులు, వికలాంగులు, వితంతుమహిళలు రెండు విడత జన్మభూమి కార్యక్రమాల్లో విన్నవించుకున్నా కొత్తగా 1688 పెన్షన్లు మాత్రమే మంజూరు చేశారు. మిగిలిన దరఖాస్తుల ఊసే లేదు.
సమగ్ర భూసర్వే జరపకుండా ఈ-పాసుపుస్తకాలు సిద్ధమయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా భూ రికార్డులు తప్పుల తడకగా జారీ అవుతున్నాయి. నకిలీపట్టాదారు పాస్తకాలు తయారు చేసి రూ.కోట్లు రుణాలు పొందినప్పటికీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు వారికి హుద్‌హుద్ పరిహారంతోపాటు పంట రుణాల మాఫీ రైతులకు అందకుండా పోయింది.
లావేరు మండలం బుతవలస, అదపాక, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు బయటపడినా చర్యలు తీసుకోలేదు. దానిపై గ్రామసభల్లో అధికారులను రైతులు నిలదీసే అవకాశాలున్నాయి.
పట్టణ ప్రాంతంలో ఇళ్లస్థలాలు మంజూరుపై నిషేదముంది. దీనివల్ల రెండేళ్లలో ఒక్క ఇంటి స్థలం కూడా మంజూరు కాలేదు.దీనికి తోడు ఇళ్ల మంజూరులో కూడా ఇంతవరకు ఒక్కటి మంజూరుకాలేదు.
కేంద్రప్రభుత్వం చేపట్టిన ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినా అవికూడా పూర్తిస్థాయిలో చేపట్టలేదు.
ఖరీఫ్ సీజన్ పూర్తయింది. వ్యవసాయకూలీలు వలసలకు సిద్ధమవుతున్నారు.
కరవు ప్రాంతాలుగా 17మండలాలు గుర్తించినా పనుల మంజూరులో జాప్యం కొనసాగుతోంది. 150రోజుల పనిదినాలు మంజూరు చేసినా ఇప్పటికీ ఇంకా పనులు మొదలు కాలేదు. ఇలాంటి సమస్యలు ఎన్నో పెండింగ్‌లో ఉన్నాయి.
కొత్తసమస్యలు తెరపైకి ..
మూడో విడత జన్మభూమిలో తెరపైకి కొత్తసమస్యలు కోకొల్లలుగా రానున్నాయి. హుద్‌హుద్‌తో 11మండలాలు దెబ్బతిన్నాయి. తుఫాన్ అనంతరం దోమపోటు వల్ల లక్షల ఎకరాల్లో పంటనష్టం ఏర్పడింది. పరిహారం కొందరికి అందలేదు. ఉద్యానపంటలకు పరిహారం చెల్లించకుండా మొండి చేయి చూపారు. దోమపోటు వల్ల దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం రూ.25కోట్లు విడుదల చేశారు. దీనికి సంబంధించి 11మండలాల్లో రైతు ఖాతాలకు జమచేసిన అధికారులు నందిగాం, పలాస మండలాల్లో రైతులకు పరిహారం చెల్లించలేదు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక్కగింజ కొనుగోలు చేయలేదు. మిల్లర్లు, అధికారుల మద్య తలెత్తిన వివాదం పరిష్కారంలో జాప్యం పండగపూట అప్పులు చేయాల్సివస్తోంది. పాతసమస్యలకు తోడు గ్రామాల్లో ఈ సమస్యలపై ప్రజలు అధికారులపై ధ్వజమెత్తనున్నారు.
‘పిటీ’షన్లు
Published Thu, Dec 31 2015 12:03 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement