‘జాస్తి’ అవినీతి రూ.60 కోట్లు పైమాటే | Jasti Krishna kishore Face Corruption Allegations | Sakshi
Sakshi News home page

కృష్ణకిషోర్‌ అవినీతి రూ.60 కోట్లు పైమాటే

Published Sat, Feb 8 2020 1:23 PM | Last Updated on Sat, Feb 8 2020 5:52 PM

Jasti Krishna kishore Face Corruption Allegations - Sakshi

సాక్షి, అమరావతి: సస్పెన్షన్‌కు గురైన ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసినప్పుడు రూ.60 కోట్లకుపైగానే అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ప్రాథమికంగా లెక్కలు తేల్చింది. ప్రజాధనం దుర్వినియోగం, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై కృష్ణకిషోర్, అకౌంట్స్‌ అధికారి శ్రీనివాసరావును గతేడాది డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖలు వేర్వేరుగా ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరిద్దరిపై కేసు నమోదు చేసి ఆరు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సీఐడీని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు కృష్ణకిషోర్‌ అమరావతిని విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం గత నెలలోనే ఉత్తర్వులిచ్చింది. ఆయనపై సెక్షన్‌ 188, 403, 409, 120 బీ కింద కేసు నమోదు చేసి సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

పెద్ద ఎత్తున నిధుల గోల్‌మాల్‌
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల కాలానికి ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా ఎంపికైన కృష్ణకిషోర్‌.. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు కృష్ణకిషోర్‌ అవినీతి చిట్టాను ఆధారాలతో సహా సేకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రూ.60 కోట్లకుపైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు సీఐడీ నిర్ధారించింది. కృష్ణకిశోర్‌ తనకు అనుకూలంగా ఉన్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకుని వారి పేరుతో నిధులు మళ్లించినట్టు తేల్చింది. పలు పనులకు ఇచ్చే వర్క్‌ ఆర్డర్‌లలో అధిక మొత్తాలు చూపి కోట్లాది రూపాయలు నిధులను దారి మళ్లించినట్టు గుర్తించింది. ప్రభుత్వ ఫైనాన్స్‌ రూల్స్‌ ప్రకారం.. వర్క్‌ ఆర్డర్స్‌లో అడ్వాన్సుగా 30 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంది. అయితే ఏకంగా 90 శాతం నిధులను ముందే చెల్లింపులు (అడ్వాన్సులు) చేసినట్టు నిగ్గు తేల్చింది.

హైదరాబాద్‌లో ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌లో ప్రింటింగ్‌ పనుల కోసం 48 సార్లు రూ.70 లక్షల వరకు వర్క్‌ ఆర్డర్స్‌ ఇచ్చినట్టు తేలింది. ఏదైనా ప్రభుత్వ శాఖ ప్రకటనలు, పబ్లిసిటీ వంటివి రాష్ట్ర సమాచార శాఖ ద్వారా ఇవ్వాల్సి ఉండగా దానితో నిమిత్తం లేకుండా కృష్ణకిషోర్‌ స్వయంగా ప్రకటనలు జారీ చేశారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి తర్జుమా చేయడానికి ఏకంగా రూ.24 లక్షలు ఖర్చు చేసినట్టుగా లెక్కలు రాసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలా అనేక అక్రమాలతో నిధులు కాజేసినట్టు గుర్తించిన సీఐడీ.. అరెస్టుకు సిద్ధమవుతోంది. కృష్ణకిషోర్‌ అరెస్టుపై హైకోర్టు 8 వరకు స్టే విధించినందున కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement