అవినీతి నిరోధక చట్టానికి సవరణలు సూచించిన జేపీ
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిరోధక చట్టానికి పలు సవరణలు చేయాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కోరారు. ఈమేరకు పార్లమెంటరీ సంఘాన్ని జేపీ న్యూఢిల్లీలో కలిసి పలు సవరణలు సూచించారని లోక్‌సత్తా పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇవ్వడానికి, లాలూచీ పడి అవినీతికి పాల్పడటానికి మధ్య స్పష్టమైన తేడా ఉంచేలా చూడాలని బృందం కోరింది.
లాలూచీ అవినీతి కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన భారం నిందితుడి మీదే ఉండాలని సూచించింది. లంచం ఇచ్చిన వారికి రక్షణ కల్పించేందుకు ప్రస్తుత అవినీతి నిరోధక చట్టంలో ఉన్న సెక్షన్‌ను తొలగించటం వల్ల ఫిర్యాదుల ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారని పేర్కొంది. ప్రకృతి వనరుల కేటాయింపు వేలం పాట ద్వారానే జరగాలని, బిడ్ దక్కించుకున్న వారు అనూహ్య లాభాల్ని అర్జిస్తే పన్ను విధించే అధికారాన్ని ప్రభుత్వానికి ఉండాలని బృందం కోరింది.