జయసుధ భర్తకు తప్పిన ప్రమాదం
సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కుమార్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గుర్తించిన కపూర్ వెంటనే కారు దిగిపోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మంటలో కారు పూర్తిగా తగలబడిపోయింది. కార్లలో మంటలు వ్యాపిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి.
రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కారులో ఆదివారం రాత్రి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం సింగన్నగూడెం చౌరస్తావద్ద జాతీయ రహదారిపై రాత్రి 8.30గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు షార్ట్‌సర్క్యూట్‌కు గురైంది.
మంత్రితో పాటు ఆయన తమ్ముడు కృష్ణారెడ్డి, పీఏ నవీన్, డ్రైవర్ కృష్ణ, గన్‌మెన్‌లు ఎల్లయ్య, హరినారాయణ, రాంబాబు, సుబ్బారావులు కారులో ఉన్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌కు వెళ్తూ సింగన్నగూడెం వద్దకు రాగానే డ్యాష్‌బోర్డు నుంచి పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే కారాపి అందరూ కిందికి దిగారు. డ్రైవర్ కారు బోయ్‌నెట్‌ను ఎత్తి వైర్లను సరిచేస్తుండగానే పెద్దఎత్తున మంటలు లేచాయి. డీజిల్ ట్యాంకు పగిలిపోయింది.