సీఐ భాస్కర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, డీఎస్పీ విజయ్‌కుమార్‌పై చిందులు తొక్కుతున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ అనుచరుల దాడిలో గాయపడ్డ కడప సీఐ హమీద్‌ఖాన్ (ఫైల్)
అనంతపురం: తాడిపత్రిలో రౌడీ రాజ్యం నెలకొంది. చట్టాలను అపహాస్యం చేస్తూ ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడుతోంది. విధి నిర్వహణలో ఉన్న తమపై ఏ క్షణంలో ఎవరు దాడికి పాల్పడతారో ఊహించని స్థితిలో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీసులు పని చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఇంతకాలం పోలీసులను నయానోభయానో గుప్పిట్లో ఉంచుకుని తమకు అనుకూలంగా పనులు చేయించుకుంటూ వచ్చిన వారే.. నేడు ఏకంగా దాడులకు తెగబడ్డారు. తమకు అడ్డువస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ ఈ దాడుల ద్వారా పోలీస్ శాఖకే హెచ్చరికలు జారీచేసినట్లైంది.
గతంలో పట్టణ స్టేషన్‌లో..
2017 డిసెంబర్ 21న తనతో ఫోనులో అనుచితంగా మాట్లాడిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు మడ్డిపల్లి శివపై అనంతపురం నగర మేయర్ స్వరూపా ఆ ప్రాంత త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు తాడిపత్రికి వచ్చి మడ్డిపల్లి శివని అరెస్టు చేసి అనంతపురానికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి ఏకంగా తన అనుచరులతో కలిసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కి చేరుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి అర్బన్ సీఐ భాస్కరరెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపట్టాడు. ‘మేమైనా చేతులకు గాజులు వేసుకున్నామా? మీ వద్ద లాఠీలు ఉంటే మావద్ద కట్టెలు ఉన్నాయి’ అంటూ ఎంతకైనా తెగిస్తామంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు. అధికారపార్టీ నేతలు కావడంతో పోలీసులు చేష్టలుడిగి చూడడం తప్పా ఏమీ చేయలేకపోయారు.
డీఎస్పీపై ఎంపీ తిట్ల పురాణం
గత ఏడాది సెప్టెంబర్ 15న చిన్నపొలమడలో చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 48 గంటల పాటు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బైఠాయించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించడమే కాక స్టేషన్ గేట్లకు తాళాలు వేసి మరి అప్పటి డీయస్పీ బంగి విజయ్‌కుమార్‌పై తిట్ల పురాణం అందుకున్నారు. పోలీసులను కొజ్జాలుగా సంభోదిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థకే తలవంపులుగా మారింది.
బరితెగించిన అనుచరులు
మట్కా బీటర్లు ఇచ్చిన సమాచారంతో నిర్వాహకుడిని అరెస్టు చేసేందుకు తాడిపత్రికి వచ్చిన వైఎస్సార్ జిల్లా సీఐ హామీద్‌ఖాన్ బృందంపై ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు, మట్కా డాన్ కె.వి.రషీద్, అతని అనుచరులు దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సంచలనం రేపింది. పోలీసులను ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా కట్టెలతో చితకబాదారు. అంతటితో ఆగకుండా వారు వచ్చిన వాహనానికి నిప్పు పెట్టి దగ్దం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సీఐ పరిస్థితి రెండు రోజులైనా విషమంగానే ఉంది. ఆయనతో పాటు సిబ్బంది కోలుకోలేకపోయారంటే ఈ దాడి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉదాసీనతే కారణం
తాడిపత్రిలో పనిచేసే పోలీసు అధికారులందరూ జేసీ సోదరుల కనుసన్నల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. వారిపట్ల స్వామి భక్తిని చూపుతూ ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండాలి. జేసీ సోదరులతో పాటు, వారి అనుచరులు ఏమి చేసినా పల్లెత్తు మాట ప్రశ్నించకూడదు. ఈ ప్రాంతంలో మట్కా మాఫియాను తలపిస్తోంది. ఈ మాఫియాకు జేసీ సోదరులు వెనుదన్నుగా నిలిచారు. అంతేకాక మట్కా మాఫియా అందజేస్తున్న మాముళ్ల మాయలోనూ పోలీసులు చిత్తయిపోయారు. తమ డబ్బు తిన్నారు కాబట్టి తామేమీ చేసినా మౌనంగానే భరించాలనే తీరును జేసీ సోదరులతో పాటు వారి అనుచరులు కనబరుస్తూ వచ్చారు. ఫలితంగా పోలీస్ వ్యవస్థ తాడిపత్రిలో పూర్తి నిర్వీర్యమైపోయింది. చివరకు ఇక్కడి పోలీసులకు గన్‌మెన్‌లు కావాలంటే నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టింగులు చేస్తున్నారంటే పరిస్థితి ఎంతటి పతనావస్థకు చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment