attacks on police
-
పోలీసులపై టీడీపీ గూండాల దాడి
నరసరావుపేట టౌన్: పోలీసులపై మరోసారి టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మంగళవారం నరసరావుపేట ప్రకాశ్‌నగర్‌లో డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావుకు చెందిన వైద్యశాల ప్రాంగణంలో హోమం చేపట్టారు. ఒక్కసారిగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ అరవిందబాబు, కడియాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు హోమం జరుగుతున్న స్థలం నుంచి మెయిన్‌రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపునకు వచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ అశోక్‌కుమార్, సిబ్బంది అడ్డుకుని అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించవద్దని కోరారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసుల చొక్కాలు పట్టుకుని నెట్టివేశారు. దీంతో కిందపడిన స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందితోపాటు వన్‌టౌన్ ఏఎస్ఐ మీరావలికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులను నెట్టివేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేసుకూంటూ ర్యాలీగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైకి చేరారు. అక్కడ నిలువరించేందుకు ప్రయత్నించిన స్పెషల్ పార్టీ పోలీసులపైనా దాడికి పాల్పడ్డారు. అనుమతి లేకుండా టీడీపీ చేపట్టిన ర్యాలీ కారణంగా ఆర్టీసీ బస్టాండ్, మల్లమ్మ సెంటర్, ఓవర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు దాడికి పాల్పడిన 20 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట వన్‌టౌన్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. -
రౌడీ రాజ్యం.. చట్టాలు అపహాస్యం
అనంతపురం: తాడిపత్రిలో రౌడీ రాజ్యం నెలకొంది. చట్టాలను అపహాస్యం చేస్తూ ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడుతోంది. విధి నిర్వహణలో ఉన్న తమపై ఏ క్షణంలో ఎవరు దాడికి పాల్పడతారో ఊహించని స్థితిలో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీసులు పని చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఇంతకాలం పోలీసులను నయానోభయానో గుప్పిట్లో ఉంచుకుని తమకు అనుకూలంగా పనులు చేయించుకుంటూ వచ్చిన వారే.. నేడు ఏకంగా దాడులకు తెగబడ్డారు. తమకు అడ్డువస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ ఈ దాడుల ద్వారా పోలీస్ శాఖకే హెచ్చరికలు జారీచేసినట్లైంది. గతంలో పట్టణ స్టేషన్లో.. 2017 డిసెంబర్ 21న తనతో ఫోనులో అనుచితంగా మాట్లాడిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు మడ్డిపల్లి శివపై అనంతపురం నగర మేయర్ స్వరూపా ఆ ప్రాంత త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు తాడిపత్రికి వచ్చి మడ్డిపల్లి శివని అరెస్టు చేసి అనంతపురానికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి ఏకంగా తన అనుచరులతో కలిసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కి చేరుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి అర్బన్ సీఐ భాస్కరరెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపట్టాడు. ‘మేమైనా చేతులకు గాజులు వేసుకున్నామా? మీ వద్ద లాఠీలు ఉంటే మావద్ద కట్టెలు ఉన్నాయి’ అంటూ ఎంతకైనా తెగిస్తామంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు. అధికారపార్టీ నేతలు కావడంతో పోలీసులు చేష్టలుడిగి చూడడం తప్పా ఏమీ చేయలేకపోయారు. డీఎస్పీపై ఎంపీ తిట్ల పురాణం గత ఏడాది సెప్టెంబర్ 15న చిన్నపొలమడలో చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 48 గంటల పాటు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బైఠాయించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించడమే కాక స్టేషన్ గేట్లకు తాళాలు వేసి మరి అప్పటి డీయస్పీ బంగి విజయ్‌కుమార్‌పై తిట్ల పురాణం అందుకున్నారు. పోలీసులను కొజ్జాలుగా సంభోదిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థకే తలవంపులుగా మారింది. బరితెగించిన అనుచరులు మట్కా బీటర్లు ఇచ్చిన సమాచారంతో నిర్వాహకుడిని అరెస్టు చేసేందుకు తాడిపత్రికి వచ్చిన వైఎస్సార్ జిల్లా సీఐ హామీద్‌ఖాన్ బృందంపై ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు, మట్కా డాన్ కె.వి.రషీద్, అతని అనుచరులు దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సంచలనం రేపింది. పోలీసులను ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా కట్టెలతో చితకబాదారు. అంతటితో ఆగకుండా వారు వచ్చిన వాహనానికి నిప్పు పెట్టి దగ్దం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సీఐ పరిస్థితి రెండు రోజులైనా విషమంగానే ఉంది. ఆయనతో పాటు సిబ్బంది కోలుకోలేకపోయారంటే ఈ దాడి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదాసీనతే కారణం తాడిపత్రిలో పనిచేసే పోలీసు అధికారులందరూ జేసీ సోదరుల కనుసన్నల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. వారిపట్ల స్వామి భక్తిని చూపుతూ ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండాలి. జేసీ సోదరులతో పాటు, వారి అనుచరులు ఏమి చేసినా పల్లెత్తు మాట ప్రశ్నించకూడదు. ఈ ప్రాంతంలో మట్కా మాఫియాను తలపిస్తోంది. ఈ మాఫియాకు జేసీ సోదరులు వెనుదన్నుగా నిలిచారు. అంతేకాక మట్కా మాఫియా అందజేస్తున్న మాముళ్ల మాయలోనూ పోలీసులు చిత్తయిపోయారు. తమ డబ్బు తిన్నారు కాబట్టి తామేమీ చేసినా మౌనంగానే భరించాలనే తీరును జేసీ సోదరులతో పాటు వారి అనుచరులు కనబరుస్తూ వచ్చారు. ఫలితంగా పోలీస్ వ్యవస్థ తాడిపత్రిలో పూర్తి నిర్వీర్యమైపోయింది. చివరకు ఇక్కడి పోలీసులకు గన్మెన్లు కావాలంటే నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టింగులు చేస్తున్నారంటే పరిస్థితి ఎంతటి పతనావస్థకు చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. -
ఆ రోజు పోలీస్స్టేషన్లపై దాడులు..పచ్చ నేతల ప్రకోపమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు గ్రామంలో సెప్టెంబర్ 23న మావోయిస్టులు మాటు వేసి కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను దారుణంగా కాల్చి చంపారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఘటన జరిగితే సాయంత్రం వరకు లివిటిపుట్టుకు పోలీసులు వెళ్లలేకపోవడం, డుంబ్రిగుడ ఎస్సై అమ్మనరావు వివాదాస్పద వ్యవహారశైలి నేపథ్యంలో అప్పటికే వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో కిడారి, సివేరిల మృతదేహాలను డుంబ్రిగుడ, అరకు పోలీస్స్టేషన్ల సమీపంలోకి తీసుకురావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. వందలాదిమంది పోలీస్స్టేషన్లపై దాడి చేశారు. కంప్యూటర్లు, రికార్డులు సహా ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఖాకీ చొక్కాలు కనిపిస్తే చాలు.. ముందూవెనుకా చూడకుండా చితక్కొట్టేశారు. ఎస్సై సురేష్ సహా మొత్తం 16మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత రెండు పోలీస్స్టేషన్లకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యోదంతంతో భావోద్వేగానికి, ఆవేశానికి లోనైన గిరిజనులే ఇదంతా చేసి ఉంటారని అందరూ భావించారు. అయితే హత్యోదంతంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. కిడారి, సివేరిల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మావోలకు చేరవేసి టీడీపీ నేతలే వారి హత్యకు సహకరించారని బయటపడగా.. హత్యోదంతం తర్వాత పరిస్థితిని అదుపు చేయాల్సిన టీడీపీ నేతలే అమాయకులను రెచ్చగొట్టి దగ్గరుండి అరాచకాలు చేయించారని కూడా తేలింది. అరాచకం సృష్టించింది వీరే.. పోలీస్స్టేషన్లపై దాడి, ధ్వంసం, దహనం కేసుకు సంబంధించి అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న మొత్తం 111మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితులు టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులే కావడం గమనార్హం. కేసులో ఏ–2గా టీడీపీకి చెందిన అరకు జెడ్పీటీసీ కూన వనజ, ఏ–3గా ఆమె భర్త, టీడీపీ నాయకుడు కూన రమేష్, ఏ–4గా టీడీపీ ఎంపీటీసీ పి.అమ్మన్న, ఏ–5గా టీడీపీ ఎంపీటీసీ కిల్లో సాయిరాం, ఏ–6గా శెట్టి బాబూరావు, ఏ–8 గా సర్పంచ్ కిల్లో రఘునా«థ్, ఏ–9గా అరకు ఎంపీపీ శెట్టి అప్పాలు.. ఇలా 111 మంది నిందితుల్లో అత్యధిక శాతం టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులే ఉన్నారు. మాపై పెట్రోలు పోసి కాల్చేయాలని చూశారు.. డుంబ్రిగుడ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ ‘ఆ రోజు పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న నన్ను, సహచర కానిస్టేబుల్ భాస్కరరావును పట్టుకుని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. బండబూతులు తిట్టారు. వీరిద్దరినీ చంపేయండి.. అని కేకలు వేస్తూ పెట్రోలు క్యాన్లు ఓపెన్ చేసి... పెట్రోలు చల్లారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి అతి కష్టం మీద బయటపడ్డాం. మమ్మల్ని పెట్రోలు పోసి కాల్చేందుకు ప్రయత్నించిన వాళ్ళను గుర్తుపడతాం,. ఘటనా స్థలంలో టీడీపీ జెడ్పీటీసీ సహా మొత్తం టీడీపీ నేతలే ఉన్నారు. పోలీస్స్టేషన్లకు నిప్పంటించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, మమ్మల్ని కాల్చి చంపాలని చూసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి’.. అని డుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎన్.సత్యనారాయణ అదే పోలీస్‌స్టేషన్ ఎస్సైతో పాటు అరకు ఎస్సైకి ఫిర్యాదు చేశారు. అసలు దోషులు టీడీపీ నేతలని తేలడంతో కేసును తొక్కిపెట్టిన పోలీసు అధికారులు గిరిజనులే ఆవేశంలో ఇదంతా చేసి ఉంటారని తొలుత పోలీసులు కూడా భావించారు. అయితే విచారణలో ఫొటోలు, వీడియో ఫుటేజీల సాక్ష్యంగా మొత్తం టీడీపీ నేతలే దగ్గరుండి అరాచకం సృష్టించారని తేలడంతో పోలీసులు అధికారులు నివేదికను తొట్టిపెట్టేశారు. ఇప్పటివరకు అరెస్టుల్లేకుండా కేసు విచారణను నిలిపివేశారు. తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్ హోం మంత్రి చినరాజప్పను కలిసి పోలీస్‌స్టేషన్‌పై దాడి, దహనం కేసులో అరెస్టుల్లేకుండా చూడాలని కోరారు. బాధ్యత గల అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన టీడీపీ నేతలే దగ్గరుండి అరాచకం సృష్టించిన వైనం బట్టబయలు కావడంతో ప్రభుత్వం ఏమేరకు వ్యవహరిస్తుందో చూడాల్సిఉంది. -
పోలీసులపై 'ఎర్ర' కూలీల దాడి : ఇద్దరి అరెస్ట్
చంద్రగిరి : చిత్తూరులో ఎర్రచందనం కూలీలు మరోసారి రెచ్చిపోయారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఆదివారం రాత్రి పోలీసులకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కూలీలు ఎదురుపడ్డారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నస్తుండగా పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లక్ష్మీపురం చెరువు సమీపంలో ఇద్దరు కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం శేషాచలం అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. -
పోలీసులపై దాడి.. రిమాండ్
నర్సాపూర్: శివ్వంపేట మండలంలోని తాళ్లపల్లి తండాలోని భూములు పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేసిన ఘటనలో మరో 12 మంది గిరిజనులను అరెస్టు చేసినట్టు స్థానిక సీఐ, కేసు పరిశోధన అధికారి తిరుపతిరాజు చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా తాళ్లపల్లి తండా పరిధిలోని ప్రవీన్‌రావు భూముల్లో పనిచేసే సిబ్బందిని నిర్బంధించారని గత నెల 29న రాత్రి సమాచారం వచ్చింది. దీంతో అదే రాత్రి అక్కడికి వెళ్లిన పలువురు పోలీసులపై గిరిజనులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇటీవల పది మందిని అరెస్టు చేసిన విషయం విదితమే. కాగా అదే కేసులో బుధవారం మరో 12 మందిని అరెస్టు చేశామని అన్నారు. తండాకు చెందిన మోతిలాల్, హీరాసింగ్, జగన్, లష్కర్లతోపాటు మరో ఎనిమిది మందిని రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్ఐ వెంకటరాజగౌడ్ పాల్గొన్నారు.