నరసరావుపేట టౌన్: పోలీసులపై మరోసారి టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మంగళవారం నరసరావుపేట ప్రకాశ్‌నగర్‌లో డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావుకు చెందిన వైద్యశాల ప్రాంగణంలో హోమం చేపట్టారు. ఒక్కసారిగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ అరవిందబాబు, కడియాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు హోమం జరుగుతున్న స్థలం నుంచి మెయిన్‌రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపునకు వచ్చేందుకు ప్రయత్నించారు.
అక్కడ విధుల్లో ఉన్న సీఐ అశోక్‌కుమార్, సిబ్బంది అడ్డుకుని అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించవద్దని కోరారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసుల చొక్కాలు పట్టుకుని నెట్టివేశారు. దీంతో కిందపడిన స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందితోపాటు వన్‌టౌన్ ఏఎస్‌ఐ మీరావలికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులను నెట్టివేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేసుకూంటూ ర్యాలీగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైకి చేరారు. అక్కడ నిలువరించేందుకు ప్రయత్నించిన స్పెషల్ పార్టీ పోలీసులపైనా దాడికి పాల్పడ్డారు.
అనుమతి లేకుండా టీడీపీ చేపట్టిన ర్యాలీ కారణంగా ఆర్టీసీ బస్టాండ్, మల్లమ్మ సెంటర్, ఓవర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు దాడికి పాల్పడిన 20 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట వన్‌టౌన్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment