వైఎస్సార్‌సీపీకి ఓటేశారన్న కారణంతో అమాయకులపై దాడులు
యరపతినేని రౌడీమూకల దాడులతో ఇళ్లు వదిలి వెళ్లిపోయిన బీసీలు
భయంతో దేవాలయాల్లో తలదాచుకున్న మహిళలు
బాధితులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి
వారిపైనా దాడికి పాల్పడిన ‘పచ్చ’ సైకోలు
అదుపు చేయలేక గాలిలోకి కాల్పులు జరిపిన పోలీసులు
సాక్షి, నరసరావుపేట: పోలింగ్ ముగిసినా పల్నాడులోటీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్ïపీకి ఓటేశారన్న అక్కసుతో జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం నుంచి అమాయకులపై టీడీపీ రౌడీ మూకలు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. ఇళ్లపై విచక్షణారహితంగా దాడులు చేస్తుండటంతో పురుషులు గ్రామాలు వదిలి ప్రాణాలు దక్కించుకోగా, మహిళలు, పిల్లలు దేవాలయంలో తలదాచుకుంటున్నారు.
బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపైనా దాడులకు తెగబడుతున్నారు. చివరకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి నాయకులను గ్రామాలు దాటించాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ బాధితులను రక్షించే చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
కొత్త గణేశునిపాలెంలో యథేచ్ఛగా దాడులు
మాచవరం మండలం కొత్త గణేషునిపాడు గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లు వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్ వర్గీయులు పెద్ద ఎత్తున టీడీపీ రౌడీలను, గూండాలను తీసుకువచ్చి దాడులకు దిగారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను టార్గెట్ చేస్తూ వారి ఇళ్లపై దాడులు చేశారు. మోటారు బైకులు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామాన్లు, టీవీలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.
ఆడవాళ్లు, పిల్లలు అనే కనికరం లేకుండా బూతులు తిడుతూ, భౌతికదాడులకు పాల్పడ్డారు. భయానక పరిస్థితుల్లో పురుషులంతా పొలాల్లోకి పరుగులు పెట్టి, అర్ధరాత్రి వరకూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు గంగమ్మగుడిలో తలదాచుకున్నారని తెలిసి, దేవాలయంపైకి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు.
చేతులెత్తేసిన పోలీసులు...
గ్రామంలో టీడీపీ చేస్తున్న దాడులపై పోలీసులకు ఫోన్‌ద్వారా, వీడియో సందేశాల ద్వారా బాధిత మహిళలు సమాచారం అందించినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఫోర్సు తక్కువగా ఉందన్న నెపంతో తప్పించుకున్నారని మంగళవారం ఆ గ్రామానికి వెళ్లిన మీడియాకు వారు తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి మంగళవారం మ«ధ్యాహ్నం గ్రామానికి చేరుకున్నారు.
అక్కడ పరిస్థితులు చూసి వారు చలించిపోయారు. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులు వచ్చిన విషయం తెలుసుకున్న వందలాది మంది టీడీపీ మూకలు వారిని చుట్టిముట్టి, వాహనాలపై రాళ్లు రువ్వారు. గ్రామం నుంచి బయటకు వెళ్లనీయకుండా రహదారిని దిగ్బంధించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మరింత రెచ్చిపోయిన టీడీపీ మూక దాడులను అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.
ఇంట్లో సామాన్లు ధ్వంసం చేశారు
ఓట్లు వేసి ఇంటికి వచ్చాం. అంతా బాగుంది అనుకున్నాం. ఒక్కసారిగా టీడీపీ వాళ్లు గుంపులు, గుంపులుగా వచ్చి మా ఇళ్లపై దాడులు చేసి, ఇంటిపైనున్న రేకులు పగులగట్టారు. ఇంట్లోని టీవీ, ప్రిడ్జ్ కూలర్, ఫ్యాన్లు ధ్వంసం చేశారు. బూతులు తిడుతూ మగవాళ్లను బతకనీయమంటూ బెదిరించారు. మేము బెదిరిపోయి గంగమ్మ గుడిలో తలదాచుకున్నాం.
– అంబటి శ్రీలక్ష్మి, బాధిత మహిళ
వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నామనే...
గ్రామంలో టీడీపీ బలంగా ఉండేది. 2019 ఎన్నికల నుంచి జగనన్నపై నమ్మకంతో మేము వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా ఉంటున్నాం. ఎలాగైనా ఈ ఎన్నికల్లో జగనన్నను గెలిపించాలని బాగా పని చేశాం. దానిని తట్టుకోలేక మా ఇంటిపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఇంటిపై రాళ్లు వేశారు. బూతులు తిట్టారు. భయంతో మా వాళ్లు రాత్రంతా పొలాల్లో తలదాచుకున్నారు. చాలా భయమేçస్తోంది. – చల్లగుండ్ల కోటేశ్వరమ్మ బాధిత మహిళ
కనీసం స్పందించని ఎస్పీ
గ్రామంలో ఇంత అరాచకం జరుగుతుంటే జిల్లా ఎస్పీ బింధుమాదవ్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు వాపోతున్నారు. ఆయన గ్రామాన్ని సందర్శించలేదు. అవసరమైన బలగాలను పంపలేదు. వారి వైఖరి ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కారంపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైందని తెలియగానే వెళ్లిన ఎస్పీ కొత్త గణేషునిపాడుకు ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment