
టీడీపీలోకి జేసీ బ్రదర్స్!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆ పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, బీకే పార్థసారథి, అబ్దుల్‌ఘని, రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు తదితరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించామని చెప్పి.. వారి చేరికపై జిల్లా నేతలను ఒప్పించే బాధ్యతను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు అప్పగించారు. కాసేపయ్యాక తిరిగి సమావేశమై జేసీ బ్రదర్స్‌కు అనంతపురం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించినట్లు సమాచారం. ఇదే అంశాన్ని ‘ఫోన్’లో జేసీ బ్రదర్స్‌కు చంద్రబాబు వెల్లడించినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ నెల 23 లేదా 24న జేసీ సోదరులు టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది.