జేసీ బ్రదర్స్ ట్రేడ్ మార్క్ ‘తమ్ముళ్లు’ కుతకుత
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో వర్గ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయమై నెలకొన్న సందిగ్ధం కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది. జేసీ సోదరుల ట్రేడ్‌మార్కు రాజకీయాలతో ఇప్పటికే జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు జోరందుకున్నాయి. అధికారమే పరమావధిగా చంద్రబాబు పరితపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా బలమైన జేసీ సోదరులను పార్టీలోకి తీసుకోవడానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. జేసీ సోదరులు పార్టీలోకి చేరకపోయినా జిల్లాలో టీడీపీ నాయకుల్లాగానే చలామణి అవుతున్నట్లు ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. దీంతో జిల్లాలోని ఏ నియోజకవర్గంలో చూసినా ఒకరికొకరు దూషించుకుంటూ.. కొట్టుకునే పరిస్థితులు ఆ పార్టీలో నెలకొన్నాయి.
టీడీపీ హయాంలోనే మైనార్టీలకు పెద్ద పీట వేశామని చెబుతున్న చంద్రబాబు.. జిల్లాలో ఆ వర్గానికి ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశం లేదని తేలిపోవడంతో ఆ వర్గాలు పార్టీపై కన్నెర చేస్తున్నాయి. ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా కొత్తగా పార్టీలోకి వస్తున్న జేసీ సోదరుల ప్రతిపాదనలకు అధినేత తలొగ్గనున్నట్లు తెలుసుకున్న పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఫోన్ ద్వారా ‘మీ ఊరూ.. మీ అభ్యర్థి’ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని అధినేత తను అనుకున్న వారికి టికెట్ కేటాయించాలని స్కెచ్ వేశారని ‘తమ్ముళ్లు’ వాపోతున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆరుగురు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే వీరిలో హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యేకు, మిగిలిన వారికీ టికెట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించినా ఆయన తీరుతో అవే స్థానాలు ఇస్తారా..
లేక స్థానాల్లో మార్పు ఉంటుందా అని సిట్టింగ్‌లు హడలిపోతున్నారు. పార్టీ కోసం తొలి నుంచి కష్టపడి పనిచేసిన వారిని కాకుండా పార్టీలోకి కొత్తగా వచ్చిన.. వచ్చే వారికి, ఆర్థికంగా బలవంతులైన వారికి టికె ట్ విషయంలో స్పష్టత ఇస్తుండడంతో పార్టీలో వర్గ రాజకీయాలు రగలుతున్నాయి. రాయదుర్గంలో కొత్తగా వచ్చిన కేవీ ఉషాదేవికి టికెట్ గ్యారెంటీ అని అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే జేసీ సోదరుల దూకుడుతో ఆమెలో ఆందోళన మొదలైంది. 2011 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగి ఓటమి చవిచూసిన దీపక్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో టికెట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే జేసీ సోదరులకు దీపక్‌రెడ్డి స్వయాన అల్లుడు కావడంతో వారి ఒత్తిడి మేరకు దీపక్‌రెడ్డికి అధినేత టికెట్ ఇస్తారేమోనన్న ఆందోళన ఉషాదేవిలో నెలకొన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
దీనికి తోడు టికెట్ పోటీ నుంచి తప్పుకోవాలని జేసీ సోదరులు ఇప్పటికే ఉషాదేవిని హెచ్చరించినట్లు రాయదుర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు చురుగ్గా పనిచేసిన ఉషాదేవి పార్టీ కార్యక్రమాలకు కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. మొదట్లో చీరలు.. జాకెట్లు, ముక్కుపుడకలు పంచుతూ జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అనుకోని రీతిలో జేసీ సోదరుల రంగప్రవేశంలో పరిస్థితి తలకిందులైంది. ఇక ఇన్నాళ్లు ఉషాదేవికి మద్దతు ఇస్తూ వచ్చిన మెట్టు గోవిందరెడ్డి సైతం ఈ ఎన్నికల్లో తనకు కాకపోయినా తన సతీమణికి లేదా.. తన కుమారుడి టికెట్ ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాల్లో కూడా తమకు అనుకూలంగా ఉన్న వారే ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉండాలని జేసీ సోదరులు ఒక జాబితాను అధినేతకు పంపించినట్లు సమాచారం.
ఇంకా పార్టీలోకి చేరకనే తమపై జేసీ సోదరులు కమాండ్ చేస్తున్నారనే ఆగ్రహం తెలుగు తమ్ముళ్ల నుంచి పెల్లుబుకుతోంది. అనంతపురం పార్లమెంటు స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీకీ బలమైన కేడర్ ఉంది. వారిని నేరుగా ఎదుర్కోవాలంటే తమకు అనుకూలమైన అభ్యర్థులను నియమించుకోవాలనే ప్రతిపాదనను చంద్రబాబు దృష్టికి జేసీ సోదరులు తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే అనంతపురం పార్లమెంటు పరిధిలో కొందరికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారంతా పనిచేసుకుంటూ పోతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో జేసీ సోదరులు జోక్యం చేసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో కూడా ఇదే విధమైన ధోరణిని అవలంబిస్తుండడంతో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో సహా పలువురు నాయకులు వారి తీరుపై అధినేతకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే అనంతపురం అసెంబ్లీ టికె ట్ మునిసిపల్ మాజీ చైర్మన్ వి.ప్రభాకర్‌చౌదరికి ఇచ్చేందుకు అధినేత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి జేసీ సోదరుల ఆగడాలు, వారి ఫ్యూడల్ పోకడలను ప్రభాకర్ చౌదరి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వారి మధ్య చాలా గ్యాప్ ఉంది. అందుకోసం ప్రభాకర్ చౌదరికి అనంతపురం టికెట్ ఇవ్వకూడదని మహాలక్ష్మికే ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్‌కు తప్పితే తన వర్గీయుడైన కంభగిరి రాముడుకు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీన్ని శమంతకమణి వర్గం వ్యతిరేకిస్తోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు కొట్రెకె మధుసూధన్ గుప్తాకు గుంతకల్లు నుంచి చోటు కల్పించాలని, కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరికి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే గుంతకల్లు నుంచి జితేంద్రగౌడ్, కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయడానికి పోలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆశలు పెట్టుకున్నారు. వీరి ప్రతిపాదన వల్ల వారి ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ నాయకుల వలసలు అధికం కాగా.. పార్టీ మొత్తం కాంగ్రెస్ మయం అయిందనే ఆందోళన ఆ పార్టీ కార్యకర్తల నుంచి వ్యక్తమౌతోంది. హిందూపురం పార్లమెంటు పరిధిలో కూడా జేసీ సోదరులు తమ అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో పావులు కదుపుతున్నారు. హిందూపురంలో మునిసిపల్ మాజీ చైర్మన్ జేఈ అనిల్‌కుమార్, జేఈ వెంకటస్వామి, బాలాజీ మనోహర్ జేసీ వర్గీయులుగా ఉన్నారు. వీరిలో ఒకరికి చోటు కల్పించాలని జేసీ ప్రతిపాదించినట్లు తెలిసింది. కదిరిలో తన వర్గీయులైన ఎస్.ఎం బాషా, డాక్టర్ సిద్దారెడ్డిని కలసి టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే.. కందికుంటకు కాకుండా వీరిలో ఒకరికి టికెట్ ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. పుట్టపర్తి నుంచి తన పీఏ సురేష్‌రెడ్డికి అవకాశం కల్పించాలని అధినేతకు ప్రతిపాదించి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి పొగబెడుతున్నారు. ఇదే విధంగా జిల్లా అంతటా తమ ముద్ర ఉండేలా జేసీ సోదరులు కసరత్తు చేస్తుండడంపై టీడీపీ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.