
ముందు బొత్సను సస్పెండ్ చేయాలి: జేసీ
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేనేలేదని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదని, ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ క్షీణదశకు వచ్చిందన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుడారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో కలిసి కేంద్ర మంత్రులు, ఎంపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, కేంద్రంలోని మంత్రులు, ఎంపీలను సస్పెండ్ చేసిన తరువాతే తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విభజనకు దారితీసిన పరిస్థితులను వివరించి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని జేసీ అభిప్రాయపడ్డారు. ‘సోనియా గాంధీని నేనేనాడూ కించపరచలేదు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి, పదవి నుంచి తప్పుకుని మంచి వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరాను. ఇందులో ఏమైనా బూతులు ఉన్నాయా?’ అని జేసీ దివాకర్‌రెడ్డి ప్రశ్నించారు.