
బాబుతో జేసీ, డీఎల్ భేటీ?
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి, కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యుడు డీఎల్ రవీంద్రారెడ్డి గురువారం రాత్రి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై సుమారు అరగంటపాటు చర్చించారు. అంతకుముందు వీరిద్దరూ తెలుగుదేశం ఉపాధ్యక్షుడు సీఎం రమేశ్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్న జేసీ చంద్రబాబుతో భేటీ అరుునట్టు సమాచారం. దివాకరరెడ్డి లేదా ఆయన సోదరుడు ప్రభాకరరెడ్డి అనంతపురం ఎంపీ స్థానానికి, జేసీ కుమారుడు తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయాలని భావిస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెప్పాయి.
అరుుతే తాను బాబుతో సమావేశం కాలేదని, ఆయన ఇంటిముందు నుంచి వెళితే టీవీల్లో భేటీ అయినట్లు బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని జేసీ ‘సాక్షి’కి చెప్పారు. ఇలావుండగా డీఎల్ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేయకుండా టీడీపీ అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు అరుున సుధాకర్ యాదవ్‌కు మద్దతు ఇవ్వనున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన బాబుతో భేటీ అరుునట్టు తెలుస్తోంది.
పలువురి చేరిక: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుతోపాటు మెదక్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ బట్టి జగపతి, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన వై.మురళీధర్‌రెడ్డిలు గురువారం టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని తానేనని, చంద్రబాబు ఈ మేరకు తనకు హామీ ఇచ్చారని మురళీధర్‌రెడ్డి ప్రచారం చేసుకున్నారు. నేతలు రమేష్ రాథోడ్, అరిగెల నాగేశ్వరరావు యాదవ్, గుళ్లపల్లి బుచ్చిలింగం, మైనంపల్లి హనుమంతరావు, ఏకే గంగాధర్, యరపతినేని శ్రీనివాసరావు, చిరుమామిళ్ల మధు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.