
ఉద్యోగమిక్కడ..నివాసమెక్కడ!
కర్నూలు : ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు.. స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. పనిచేస్తున్న చోట కాకుండా.. సమీప పట్టణాల్లో కాపురం ఉంటున్నారు. జరగరాని ఘటనలు చోటు చేసుకుంటే.. వీరు ఆ ప్రాంతానికి చేరుకునే లోపు పుణ్యకాలం గడిచిపోతుంది. ఈ విషయంలో ఎస్పీ ఆదేశాలను సైతం లెక్క చేయని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు స్థానికంగానే నివాసం ఉండాలని.. లేని పక్షంలో కఠినంగా చర్యలు ఉంటాయని ఏడాది క్రితం ఎస్పీ హెచ్చరించినా ఇప్పటికీ మార్పు కరువైంది.
జిల్లాలో 20 మంది ఎస్‌ఐలు, ముగ్గురు, నలుగురు సీఐలు స్థానికంగా నివాసం ఉండటం లేదు. ఆరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో 89 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సబ్ డివిజన్ కేంద్రాల్లో 20 పోలీస్ స్టేషన్లు ఉండగా.. మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో సగం స్టేషన్ల అధికారులు తమ పిల్లల చదువులు, ఇతర అవసరాల నిమిత్తం పట్టణాల్లో ఉంటున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు వారి రాకకోసం సిబ్బంది ఎదురు చూడాల్సి వస్తోంది.
అంతా అప్ అండ్ డౌన్
నందవరం, నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో పని చేసే అధికారుల నుంచి సిబ్బంది వరకు అందరూ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. రాత్రి అయితే ఒకరిద్దరు కానిస్టేబుళ్లు మినహా గస్తీ విధులకు కూడా సిబ్బంది ఉండడం లేదు. నందవరం ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు ఎమ్మిగనూరులో నివాసం ఉంటున్నారు. ఏఎస్‌ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది కూడా ఎమ్మిగనూరులోనే నివాసం. దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అనుకోని ఘటన జరిగితే ఇక్కడి నుంచి వెళ్లే వరకు సిబ్బంది ఎదురు చూడాల్సిన పరిస్థితి. కె.నాగలాపురంలో సుమారు 20 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ కర్నూలులోనే కాపురం ఉంటున్నట్టు సమాచారం. గూడూరు స్టేషన్‌లోనూ సగం మంది కానిస్టేబుళ్లు కర్నూలు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. కర్నూలు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని స్టేషన్లలో పనిచేసే సిబ్బంది పరిస్థితి ఇదే.
ఓర్వకల్లు, బ్రాహ్మణకొట్కూరు, ఉలిందకొండ ప్రాంతాల్లో పని చేస్తున్న సిబ్బంది కూడా రోజూ కర్నూలు నుంచి విధులకు వెళ్తున్నారు. దీంతో జిల్లాలోని సగం పోలీస్ స్టేషన్లలో రాత్రి వేళ వెళ్లిన బాధితులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఉన్న ఒకరిద్దరు కానిస్టేబుళ్లు వచ్చిన వారిని దబాయించి పంపుతున్నారు. సారు లేరు రేపు రాపో అంటూ కానిస్టేబుళ్లు ఇచ్చే సమాధానాలతో రోజుల తరబడి బాధితులు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
స్థానికంగా ఉండాల్సిందే..
నిబంధనల మేరకు ఉద్యోగులు పనిచేసే చోటే నివాసం ఉండాలి. అందులోనూ పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసు సిబ్బంది స్థానికంగా ఉండాల్సిందే. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
- ఎస్పీ ఆకె రవికృష్ణ