- ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆవేదన
- పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీపీ, సర్పంచ్
అనంతగిరి : జొరమొచ్చినా పట్టించుకోలేదు...ఆస్పత్రికి తీసుకెళ్లలేదు...ఇంటికెళ్దామన్నా పంపించలేదు....అంటూ శివలింగాపురం ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాలలో పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్ నిర్లక్ష్యం వహిస్తుండడంతో జ్వరంతో ఇంటికి వెళ్లలేక, పాఠశాలలో ఉండలేక ఏంచేయాలో తెలియడం లేదన్నారు. స్థానిక ఎంపీపీ పైడితల్లి శనివారం ఆ పాఠశాలను తనిఖీ చేసినపుడు విద్యార్థుల దుస్థితిని గమనించారు.
వారం రోజులుగా తాము జ్వరాలతో బాధపడుతున్నా తమను ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదని విద్యార్థులు తెలిపారు. కాగా ఎంపీపీ తనిఖీ నిర్వహించిన సమయంలో వార్డెన్, హెచ్‌ఎం కూడా పాఠశాలలో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం శివలింగపురం ఆశ్రమ పాఠశాలలో సమర్డి తిరుపతి, మామిడి కృష్ణ, గెమ్మేల జయరాజు, కిల్లో అరుణ్ కుమార్, గరం వికాష్‌లతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు.
ఇది గమనించిన ఎంపీపీ పైడితల్లి, సర్పంచ్ దుడ్డు సోములు వైద్యాధికారులకు సమాచారం అందించి వైద్య సహాయం అందించారు. ఇదిలా ఉండగా వసతిగృహల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపాలని, సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్‌ఎం, వార్డెన్‌లను ఎంపీపీ హెచ్చరించారు.