దసరా జోష్
జిల్లా అంతటా విజయదశమి సందడి
పండగకు ముస్తాబయిన గ్రామాలు
భక్తులతో పోటెత్తిన అమ్మవార్ల దేవాలయాలు
విశాఖపట్నం: జిల్లా అంతా దసరా పండగ సందడితో శోభిల్లుతోంది. పల్లెలకు, పట్టణాలకు చుట్టాలంతా వచ్చి చేరుతున్నారు.సెలవులకు విద్యార్థులు, బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు సొంత గ్రామాలకు రావడంతో పల్లెలన్నీ పండగ హడావిడితో సందడిగా మారాయి. కొత్త వాహనాలు కొనుగోలు, పాత వాహ నాలకు హంగులు దిద్దే పనిలో యువత నిమగ్నమయ్యారు. వాహనాల కొనుగోలుతో మోటారు షోరూంలు, కొత్త దుస్తులు, సామాగ్రి కొనుగోలుతో వస్త్రదుకాణాలు, ఎంటర్‌ప్రైజెస్‌లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 8 గంటలకే దుకాణాలను తెరచి రాత్రి 11 గంటల వరకూ ఉంచుతున్నారు. జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట,పాడేరు పట్టణాల్లో దసరా సందడి నెలకొంది. మార్కెట్‌లు కిటకిటలాడుతున్నాయి. మరో పక్క దసరా పండగను పురస్కరించుకొని అమ్మవార్ల ఆలయాలను ముస్తాబు చేశారు.
దసరా సందర్భంగా వివిధ గ్రామాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రైళ్లు, బస్సుల్లో కలిపి లక్షన్నర మందికి పైగా విశాఖ వచ్చినట్టు అంచనా . దసరా సందర్భంగా వీధులన్నీ విద్యుద్దీపాలంకరణతో విరాజిల్లుతున్నాయి. ఓ పక్క అమ్మవార్ల దేవాలయాలకు భక్తులు పోటెత్తుతుండగా, మరో పక్క షాపింగ్ హడావుడి మరింత పెరగడంతో దుకాణాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. వస్త్ర, బంగారు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల దుకాణాలన్నీ కొత్త స్టాకుతో కళకళలాడుతున్నాయి. మార్కెట్లు రెండు రోజులుగా దసరా జోష్‌తో ఉన్నాయి. గతేడాది హుద్‌హుద్ ధాటికి దసరా పండుగ కనుమరుగైంది. దీపావళిని ప్రభుత్వమే రద్దు చేసింది. ఇలా అప్పట్లో పండుగలు లేకపోవడంతో ఇప్పుడు దసరా హడావుడి రెట్టింపు కనిపిస్తోంది.
అమ్మవార్ల ఆలయాలు కిటకిట: దశరా శోభతో జిల్లాలోని అమ్మవార్ల ఆలయాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. అనకాపల్లి నూకాంబిక అమ్మవారు, కశింకోట, యలమించిలి, నర్సీపట్నం, చోడవరం తదితర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో సందడిగా కనిపించాయి. ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
రైళ్లు రద్దీ : రైళ్లు రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. విశాఖఖు రాకపోకలు సాగించే వారు ఎక్కువగా ఉండడ ంతో రద్దీ కొనసాగుతోంది. గోదావరి, రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు రద్దీగా ఉన్నాయి. ప్యాసింజర్లు కూడా కిక్కిరిసి దర్శనమిస్తున్నాయి. అయితే రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు, బస్సులు ఉండడంతో పెద్దగా సమస్య లేదని ప్రయాణికులు చెబుతున్నారు.