సాక్షి, అనంతపురం : ‘నాన్నా బంగారు లేయ్ నాన్న. ఓరేయ్ ప్రకాషూ అమ్మను వచ్చానురా... లేయ్‌రా.. నాయనా’ అంటూ ఆతల్లి పెట్టిన కన్నీరు అందరినీ కలచివేసింది. నిండా పాతికేళ్లుకూడా లేని కొడుకు కానరానిలోకాలకు పోయాడని తెలిసిన ఆకన్నపేగు పెట్టిన ఆర్తనాదం అంతా ఇంతాకాదు.. నిండా పాతికేళ్లు లేవు... పైగా డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్‌టీ) కోర్సు చదువుతున్నాడు. ఆరోగ్య విషయంలో ప్రాథమికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అనుభవమూ ఉంది. కానీ విధి చిన్నచూపు చూసింది. ఆస్పత్రి గేటువద్దే ఉన్న ఆ యువకుడికి ఛాతిలో నొప్పిరావడంతో నడుచుకుంటూ వెళ్లి ఎమర్జెన్సీ వార్డులోని బెడ్‌పై పడుకున్న అతను కొద్ది క్షణాల్లోనే కన్నుమూశాడు. కొడుకు మరణ వార్త విని ఆతల్లి తల్లడిల్లింది. ‘నాన్నా బంగారు లేయ్ నాన్న. ఓరేయ్ ప్రకాషూ అమ్మను వచ్చానురా...లేయ్‌రా..నాయనా’ అంటూ ఆతల్లి పెట్టిన కన్నీరు అందరినీ కలచివేసింది.
ఈ సంఘటన సోమవారం సర్వజనాస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... విడపనకటళ్ మండలం గడేహొత్తూరుకు చెందిన రామలింగప్ప, శివలింగమ్మల కుమారుడు ప్యాపిలి సూర్యప్రకాష్(23) నగరంలోని సీట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో డీఎంఎల్‌టీ (డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. క్లినికల్స్‌లో భాగంగా సోమవారం సర్వజనాస్పత్రిలోని ఓపీ విభాగం బ్లడ్ కలెక్షన్ పాయింట్‌లో విధులు నిర్వర్తించాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో రూంకు వెళ్లేందుకు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఛాతినొప్పి రావడంతో వెంటనే నడుచుకుంటూ ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి పడుకున్నాడు. అయితే బెడ్‌పై పడుకున్న సూర్యప్రకాష్ ఉలుకూ పలుకూ లేకపోవడంతో వెంటనే అక్కడి చేరుకున్న డ్యూటీ డాక్టర్ శివకుమార్... అతన్ని పరీక్షించి, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించారు. పది నిమిషాల ముందు తమతో మాట్లాడిన సూర్యప్రకాష్ నిర్జీవంగా పడి ఉండడం చూసిన సీనియర్ టెక్నీషియన్లు కన్నీరుమున్నీరయ్యారు.
నాన్నా ప్రకాష్ అమ్మనొచ్చాను లేయ్ రా..
‘నాన్నా బంగారు లేయ్ నాన్న. ఓరేయ్ ప్రకాషూ అమ్మను వచ్చానురా...లేయ్‌రా..నాయనా’ అంటూ సూర్యప్రకాష్ తల్లి శివలింగమ్మ కుమారుడి మృతదేహంపై పడి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలివచ్చి తమ మిత్రుడుని తలుచుకుని శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment