అనంతపురం సిటీ: జిల్లాపరిషత్ డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చిత్తుకాగితం మొదలు టేబుళ్లు, చైర్లు, బ్యాలెట్ పేపర్లు, కలప దేనినీ వదలకుండా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని, అంబేడ్కర్ భవన్ అద్దెలోంచి లంచం ఇవ్వలేదని తనపై లేనిపోని అభాండాలు వేసి చర్యలు తీసుకున్నారని, ఇకనైనా డిప్యూటీ సీఈఓ ఆగడాలకు అడ్డుకట్ట వేయండని జూనియర్ సహాయకులు వై.టి.నరేంద్రశర్మ కలెక్టర్ వీరపాండియన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు రోజుల కిందట అందిన ఈ ఫిర్యాదుపై కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే..
‘జెడ్పీలో జూనియర్ సహాయకులుగా పని చేస్తున్న వైటీ నరేంద్రశర్మ అను నేను డిప్యూటీ సీఈఓ అనాలోచిత కారణంగా అన్యాయంగా సస్పెన్షన్‌లో ఉన్నాను. అంబేడ్కర్ భవనం కేర్ టేకర్‌గా 2017 జూలై నుంచి నాకు బాధ్యతలు అప్పగించారు. ఫర్నీచరు, మంచాలు, ఇతర సామగ్రి సమకూర్చుకునేందుకు డిప్యూటీ సీఈఓని ఆశ్రయించాను. అధికారి నోటి మాటగా ‘అద్దె డబ్బుల్లో సామగ్రి కొనుగోలు చేసి బిల్లులు పెట్టండి’ అని సూచించారు. ఆయన ఆదేశాల మేరకు సామగ్రి కొనుగోలు చేసిన బిల్లులను అధికారి వద్దకు పలుమార్లు తీసుకెళ్లగా ‘చూద్దాంలే’ అంటూ నెలల తరబడి కాలయాపన చేశారు. కొద్ది రోజుల అనంతరం అధికారి వద్దకు వెళ్లి బిల్లులపై సంతకాలు చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేయగా...నెలకు రూ.10 వేలు నాకు ఇచ్చేలా ‘ప్లాన్’ చేయండని చెప్పారు.
లేదంటే బిల్లుల గురించి నా వద్దకు రావద్దని హెచ్చరించారు. నా వల్ల కాదని తెగేసి చెప్పిన పాపానికి బిల్లులు కూడా చేయడం కుదరదని చెప్పి వేధింపులకు దిగాడు. ఈ నేపథ్యంలో తన వర్గానికి చెందిన కొందరు వ్యక్తులతో తప్పుడు ఫిర్యాదులు పెట్టించి అంబేడ్కర్ భవనంలో సామగ్రికి వినియోగించిన డబ్బును నా సొంతానికి వాడుకున్నట్లు అభియోగం మోపారు. దీంతో నాకు చార్జ్ మెమో ఇచ్చారు. అక్కడితో ఆగని అధికారి లేనిపోని పుకార్లు పుట్టించి సీఈఓ వద్దకు బలవంతంగా పంపి మరీ నన్ను సస్పెండ్ చేయించారు. నాలుగు నెలలుగా అధికారులు తీసుకున్న చర్యలకు అవమానంతో కుంగిపోతున్నాను. నాకు ఎటువంటి సస్పెండ్ అలవెన్స్‌లు కూడా ఇవ్వకుండా సదరు అధికారి అడ్డు పడుతూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.
ఆ అధికారి అక్రమాల పుట్ట
‘కార్యాలయం ఆవరణలోని పెద్ద చెట్లను అటవీశాఖ అనుమతి లేకుండా నరికించి.. నాలుగు ట్రక్కుల కలపను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. డీపీసీ కార్యాలయంలో నిల్వ ఉంచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, కార్యాలయానికి సంబంధించిన పది బీరువాలు, ఫైళ్లు, స్టేషనరీని అధికారుల అనుమతి లేకుండా గతేడాది అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇందులో ఒక్క పైసా కూడా జెడ్పీ ఖాతాలోకి జమ చేయలేదు. బదిలీలు, డెప్యుటేషన్ల కోసం వచ్చిన వారి నుంచి వేలాది రూపాయలు లంచంగా తీసుకున్నారు. ఎంపీడీఓ క్యాడరు గల వ్యక్తి డిప్యూటీ సీఈఓగా చాలాకాలంగా పాతుకుపోయి ఉద్యోగులను వేధించి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది.’
ఆరోపణలు అర్థరహితం
విధి నిర్వహణలో తప్పిదాలు చేసిన వారిపట్ల కొంత కఠినంగా వ్యవహరించాం. దీంతో ఆ ఉద్యోగి కక్షసాధింపు చర్యలకు దిగాడు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లన్నీ గదిలో భద్రపరిచాం. ఇక కార్యాలయ ఆవరణలో కలపను అమ్ముకున్నానని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. కలప అమ్మగా వచ్చిన డబ్బును చలానా తీశాం. ఎవరు అడిగినా ఆ గదిలో కాగితాలు, కలపకు సంబంధించిన చలానా చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను.– సూర్యనారాయణ,డిప్యూటీ సీఈఓ, జిల్లాపరిషత్
Comments
Please login to add a commentAdd a comment