మండలానికో జూనియర్‌ కాలేజీ | Junior College For Every Mandal in Prakasam | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యకు ఊతం

Published Thu, Sep 12 2019 12:19 PM | Last Updated on Thu, Sep 12 2019 12:19 PM

Junior College For Every Mandal in Prakasam - Sakshi

ఒంగోలు టౌన్‌ :పదో తరగతి వరకు ఇంటికి, ఊరికి సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇంటర్‌ మీడియట్‌కు ఎక్కడో దూరంగా ఉన్న కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది. కొత్త వాతావరణంలో ఇమిడేందుకు వారికి కొంత సమయం పడుతోంది. దీని వల్ల డ్రాప్‌ అవుట్స్‌ శాతం కూడా పెరుగుతోంది. విద్యార్థులకు దూరాభారాన్ని తగ్గించి, వారు పదో తరగతి వరకు ఎక్కడ చదువుకున్నారో అక్కడే జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేస్తే...! విద్యార్థుల ఆనందానికి అవధులుండవు. తల్లిదండ్రులకు కూడా తమ బిడ్డలు తమ వద్దనే ఉండి కాలేజీ చదువులు చదువుకుంటున్నారని సంతోషపడతారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షించారు. మండలానికో జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అది కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జూనియర్‌ కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేస్తూ అక్కడే ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో జిల్లాలోని అన్ని మండలాల్లో జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించినవిధివిధానాలు విడుదల కావలసి ఉంది.

ప్రస్తుతం 33 జూనియర్‌ కాలేజీలు
జిల్లాలో 56 మండలాలు ఉండగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ కలిíపి మొత్తం 206 జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 33 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, 12 ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలు, 161 ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జిల్లాలో దాదాపు 56 వేల మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో 10500 మంది  ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతుండగా, మిగిలిన వారు ప్రైవేట్, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో  చదువుతున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో అదనంగా మరికొన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.

‘ఉన్నత’ అప్‌గ్రేడ్‌
జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలలు జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ కానున్నాయి. ఉన్నత పాఠశాలలకు సంబం«ధించి పూర్తి స్థాయిలో తరగతి గదులు ఉండటం, విశాలమైన స్థలాలు ఉండటంతో అక్కడ జూనియర్‌ కాలేజీలకు భవన నిర్మాణాలు చేపట్టేందుకు వీలుకలగనుంది. దానికితోడు ఆ ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకున్న విద్యార్ధులు, ఇంటర్‌ మీడియట్‌ కూడా అక్కడే చదువుకునే వెసులుబాటు కలగనుంది. పదవ తరగతి వరకు విద్యార్థులు కనబరిచే ప్రతిభను గమనించిన అక్కడి ఉపాధ్యాయులు వారు ఏ కోర్సుల్లో చదివితే బాగుంటుంది, ఆ కోర్సుల ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేసి వారికి సరైన దిశానిర్దేశం చేసేందుకు వీలుకలగనుంది.

కేజీబీవీలు అప్‌గ్రేడ్‌..
ఇదిలా ఉండగా జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో కొన్ని జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ అయ్యాయి. బాలికల కోసం ప్రత్యేకంగా కేజీబీవీలను ఏర్పాటు చేశారు. ఆరు నుంచి పదో తరగతి వరకు కేజీబీవీల్లో చదువుకున్న బాలికలు తాము అప్పటి వరకు చదువుకున్న చోటే ఇంటర్‌ మీడియట్‌ చదివే అవకాశం రావడంతో ఆ బాలికల్లో డ్రాప్‌ అవుట్‌ శాతం కూడా తగ్గింది. కేజీబీవీలు ఇంటర్‌ విద్య వరకు అప్‌గ్రేడ్‌ అయిన నేపథ్యంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు జూనియర్‌ కాలేజీలకు అప్‌గ్రేడ్‌ కానున్న నేపథ్యంలో అక్కడ చదువుకునే వారిలో కూడా డ్రాప్‌ అవుట్‌ శాతం పూర్తిగా తగ్గించే వీలు కలగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement