
కేజీహెచ్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ బైక్ ర్యాలీ చేస్తున్న జూడాలు
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ వైద్యులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తారని ఏపీ జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం కేజీహెచ్ ప్రధాన ద్వారం వద్ద నిరవధిక సమ్మెకు దిగిన జూనియర్ వైద్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ జీవోలు చెవిలో పువ్వులు అంటూ నినాదాలు చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో సమ్మెకు దిగామని చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న ఉపకార వేతనాలను 15 శాతం పెంచామని, బకాయిపడ్డ ఉపకార వేతనాలను వెంటనే చెల్లిస్తామని చెబుతూ ప్రభుత్వం దొంగ జీవోను విడుదల చేసిందన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం జూనియర్ వైద్యులను వంచిస్తుందన్నారు.
నెల రోజుల నుంచి ఉపకార వేతనాలను పెంచాలని వినతి పత్రాలు సమర్పిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 2009లో పెంచిన ఉపకార వేతనాన్నే ఇప్పటీకీ చెల్లిస్తున్నారని, 2018లో పెంచాల్సి ఉన్నా ఇప్పటివరకూ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. 2016–17లో బకాయి ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర కేసులను చూసేందుకు టీమ్‌ను సిద్ధం చేశామని చెప్పారు. పీజీ పూర్తి చేసిన తరువాత ఏడాది పాటు ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుని మరుసటి ఏడాది రిజిస్ట్రేషన్ చేస్తుందని, నమోదు అయిన తరువాత సీనియర్ రెసిడెంట్స్‌గా గుర్తింపు పొందేందుకు మరో ఏడాది పనిచేయాల్సి వస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య విద్యా సంచాలక శాఖ సీనియర్ రెసిడెంట్స్ పేరిట విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ రెసిడెంట్స్‌కు పీజీ పూర్తి చేసిన రెండు నెలల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజారోగ్యానికి భంగం కలిగి ప్రాణనష్టం జరిగితే అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, జూనియర్ వైద్యులది కాదని అన్నారు. అనంతరం కేజీహెచ్, జగదాంబ కూడలి, సరస్వతీపార్క్, డాబాగార్డెన్స్, జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 500 మంది జూనియర్ వైద్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment