కాకినాడ క్రైం :ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైద్యం కోసం నిత్యం మూడు వేల మంది వచ్చే కాకినాడ ప్రభుత్వాస్పత్రి అవుట్ పేషెంట్ విభాగంలో మంగళవారం ఎక్కడి సేవలు అక్కడే నిలిచిపోయాయి. జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మె రెండో రోజైన మంగళవారం కొనసాగింది. జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్స్, ఎంబీబీఎస్ విద్యార్థులు సుమారు 1500 మంది సమ్మెలో పాల్గొన్నారు.
కరప గ్రామానికి చెందిన విజయలక్ష్మి ఏడో నెల గర్భిణి కావడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి మంగళవారం వచ్చింది. సమ్మె కారణంగా ఆమెను శుక్రవారం రావాల్సిందిగా 11వ నంబరు ఓపీలోని వైద్య సిబ్బంది సూచించడంతో ఆమె దిగాలుగా వెనుదిరిగింది. ఇలా అనేకమంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఆస్పత్రి అత్యవసర విభాగంలో మినహా అన్ని వార్డుల్లో సేవలు నిలిచిపోయాయి. ప్రధానంగా గైనిక్, ఆర్థోపెడిక్, మెడికల్, కార్డియాలజీ, ఊపిరితిత్తుల విభాగాలకు రోగులు వస్తుంటారు. జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉండడంతో వైద్య సేవలందించలేక వైద్యులు వారిని వెనక్కి పంపించేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మినహా మిగిలిన వారిని చూసే దిక్కు లేకపోవడంతో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని వార్డుల్లోనూ..
జీజీహెచ్ గైనిక్ విభాగానికే ప్రతి రోజూ సుమారు 400 మంది గర్భిణులు వస్తుంటారు. 11వ నంబరు ఓపీలో వారి పరిస్థితి మంగళవారం దయనీయంగా మారింది. గంటల తరబడి వేచిఉన్నా.. వైద్యుల దగ్గరికి వెళ్లేసరికి ఁనీకు బాగానే ఉంది కదా, జూనియర్ డాక్టర్లు లేరు, శుక్రవారం రండి..రూ. అంటూ వెనక్కి పంపించేశారు. వివిధ సంఘటనల్లో ఎముకలు విరిగిన వారు ఆర్థోపెడిక్ విభాగానికి నిత్యం సుమారు 600 మంది వస్తుంటారు. వారికి ఓపీ విభాగంలో 20 మందికి పైబడి పీజీలు వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. పీజీలు సమ్మెలో ఉండడంతో ఆ భారం ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లపై పడింది. మెడికల్, కార్డియాలజీ, ఊపిరితిత్తులు, చిన్నపిల్లలు, ఈఎన్‌టీ, దంత, కంటివైద్య విభాగాల ఓపీల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
రోగులను తగ్గించే ప్రయత్నం
ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో సుమారు 1500 మంది రోగులు చికిత్స పొందుతుంటారు. సమ్మె కారణంగా ఆ సంఖ్యను కూడా తగ్గించుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. కొత్తవారిని జాయిన్ చేసుకోకపోగా, ఉన్నవారిని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆయా వార్డుల్లో 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉండేది జూనియర్ వైద్యులే. ప్రొఫెసర్లు కేస్ షీట్‌లో రాసిన ప్రకారం వారికి వైద్యం అందించేది కూడా వీరే. కొన్ని రకాల స్కానింగ్‌లు కూడా జూనియర్ వైద్యులే చేస్తుంటారు. దీంతో ఇన్వెస్టిగేషన్స్, శస్త్రచికిత్సలు కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం సుమారు వంద శస్త్ర చికిత్సలు చేస్తుంటారు. ప్రస్తుతం అత్యవసర, గైనిక్ ఆపరేషన్ థియేటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన వాటిలో కూడా ఎమర్జెన్సీ ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు.
మానవహారంగా ఏర్పడ్డ జూడాలు
డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన జూనియర్ డాక్టర్లు మంగళవారం బాలాజీ చెరువు సెంటర్‌లో సుమారు అరగంట సేపు మానవహారం నిర్వహించారు. జీజీహెచ్ మెయిన్‌గేటు వద్ద ధర్నా నిర్వహించి, అక్కడి నుంచి ర్యాలీగా బాలాజీచెరువు సెంటర్‌కు చేరుకున్నారు. నల్లరిబ్బన్లతో చేతులు కట్టుకుని నిరసన తెలిపారు.
ఎక్కడి సేవలు అక్కడే బంద్
Published Wed, Nov 26 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement