మొదటి సంవత్సరం 81 శాతం, సీనియర్ ఇంటర్‌లో 84 శాతం ఉత్తీర్ణత
రెండు విభాగాల్లోనూ బాలికలదే పైచేయి
తొలిసారిగా రెండు ఫలితాలూ ఏకకాలంలో విడుదల
జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మనమే టాప్
విజయవాడ : ఇంటర్‌మీడియెట్‌లో జిల్లా విద్యార్థులు డబుల్ ధమాకా సాధించారు. మంగళవారం విడుదలైన మొదటి, రెండవ సంవత్సరాల పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లాను రెండు విభాగాల్లోనూ మొదటిస్థానంలో నిలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 81 శాతం, రెండో సంవత్సరంలో 84 శాతం ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. విద్యల రాజధానిగా వెలుగొందుతున్న జిల్లా మరోసారి ర్యాంకును పదిలం చేసుకుంది. ఉత్తీర్ణత క్రమంలో రెండు సంవత్సరాల్లో 80 శాతానికి పైబడి ఉత్తీర్ణత సాధించింది. జూనియర్, సీనియర్ రెండు విభాగాల్లోనూ బాలికలో అగ్రస్థానంలో నిలిచారు. గడచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది జిల్లా ఉత్తీర్ణత శాతం కూడా పెరిగింది.
మొదటిసారి ఏకకాలంలో...
గతంలో ఎన్నడూ లేనివిధంగా మొదటి సారి ఏకకాలంలో ఇంటర్ జూనియర్, సీనియర్ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. గతంలో కనీసం వారం రోజుల వ్యవధిలో ఈ ఫలితాలు విడుదల చేసేవారు. ప్రస్తుతం పరీక్షా ఫలితాల్ని విజయవాడలోనే రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. గత ఏడాది జిల్లా నాలుగో స్థానంలో నిలవగా ఈ ఏడాది మొదటి స్థానం దక్కించుకోవటం విశేషం.
జూనియర్ ఇంటర్ ఫలితాలు ఇలా...
జిల్లాలో ఈ ఏడాది మొత్తం 63,707 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 51,294 మంది వివిధ గ్రేడ్‌లలో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81గా ఉంది. మొదటి సంవత్సరంలో 34,095 మంది బాలురకు గాను 26,911 మంది, 29,612 మంది బాలికలకు గాను 24,383 మంది ఉత్తీర్ణులయ్యారు. 79 శాతం బాలురు, 82 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో జిల్లాకు చోటు దక్కింది.
సీనియర్ ఇంటర్ ఫలితాలు ఇలా...
సీనియర్ ఇంటర్‌లో 57,448 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 48,027 మంది ఉత్తీర్ణులయ్యారు. 84 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. బాలుర విభాగంలో 30,258 మంది హాజరుకాగా 25,081 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 27,190 మందికి గాను 22,946 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 83 శాతం, బాలికల విభాగంలో 84 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 990 మార్కులతో జువ్వాది శివరామకృష్ణ, బైపీసీలో ఇంద్ర స్వరూప్ నాయక్ (991), బొజ్జా ప్రదీప్‌రెడ్డి (990), మిట్టపల్లి అలేఖ్య (989), విజయ్‌కుమార్ (989), పి.శ్రీశ్రావ్య (988) అత్యధిక మార్కులు సాధించారు.