సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీనీ నిలబెట్టుకోకపోగా మళ్లీ సీఎం అయితే ఏదేదో చేస్తానంటూ మాయమాటలు చెబుతున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రం చీలిక అంచుల్లో ఉన్నా బాబు తన విధానమేంటో చెప్పకుండా ప్రజలను గందరగోళపర్చడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఎగదోస్తూ బాబు తమాషా చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై తనది కొబ్బరి చిప్పల సిద్ధాంతమని బాబు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్రం ముక్కలైతే తానెక్కడ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో బాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2కే కిలో బియ్యం, మద్య నిషేధం వంటి పథకాలను నిర్వీర్యం చేశారని, ఇపుడు మళ్లీ సీఎం అయితే ఏవేవో చేస్తానంటున్నారని జూపూడి మండిపడ్డారు. మహిళలకు మాంగళ్యం, పీజీ వరకూ బాలికలకు ఉచిత విద్య, సైకిళ్లు, బాలిక పుడితే రూ.5 వేలు ఇస్తామని, బలహీనవర్గాలకు 35 లక్షల ఇళ్లు కట్టిస్తానని బాబు ప్రకటించినా.. వాటిని నెరవేర్చలేదన్నారు. విభజనపై సరైన వైఖరి లేని వ్యక్తి ఇవన్నీ చేస్తానంటే ప్రజలు నమ్మరన్నారు.