సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి ముసుగులో చంద్రబాబు నాయుడు, ఆయన ముఠా ఎంత దోచుకున్నారో లెక్క చూసి, ప్రజలకు తెలియజెప్పడం కూడా తప్పంటే ఎలా? అని అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ ఎల్లో మీడియాను ప్రశ్నించారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న విచారణ కమిటీలు, విజిలెన్స్ దర్యాప్తులతో బెంబేలెత్తిన చంద్రబాబు, ఆయన అనుచరుల తీరు చూస్తుంటే ఇంటి యజమానే దొంగతనం చేసి నా ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయారన్నట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
చంద్రబాబు బృందానికి తానా అంటే తందాన అనే చందంగా ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోందని, జగన్ ఏదో కాని పని చేసినట్టుగా దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంట్లో దొంగలు పడినప్పుడు ఎంత సొమ్ము ఉందో, ఎంత పోయిందో లెక్క చూసుకుని ప్రజలకు చెప్పాల్సిన పని లేదా? అని నిలదీశారు. పోయిన సొత్తు ఎంతో ప్రజలకు చెబితే అభివృద్ధి ఆగిపోయినట్టా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన బృందం, వారికి మద్దతు ఇస్తున్న మీడియా చేస్తున్న ప్రచారం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వైఎస్ జగన్ విధానాలు ఆదర్శనీయం
రాష్ట్ర శాసనసభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అద్భుతమైన బిల్లులు తీసుకువచ్చి, సామాజిక న్యాయం కోసం బాటలు వేసిందని జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ కొనియాడారు. నిధుల్లో, నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, మహిళలకు 50 శాతం కేటాయించిన తీరు ప్రశంసనీయమని తెలిపారు. ఇంతకు మించిన సమన్యాయం ఏముంటుందని అన్నారు. ప్రాధమిక విద్యతోనే అభివృద్ధి అని గుర్తించిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని ఆయన అనుచరులు భయపడుతున్నారని తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి విధానాలు దేశంలో ఎందరికో ఆదర్శనీయమని జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment