'కేబినెట్ నిర్ణయాల్లో బేలతనం కనిపిస్తోంది'
హైదరాబాద్: కేబినెట్ నిర్ణయాల్లో బేలతనం కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ డిప్యూటీ లీడర్ జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు. కేబినెట్ తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత లేదన్నారు. సోమవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జ్యోతుల నెహ్రూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలపై టీడీపీ ప్రభుత్వం నీళ్లు చల్లిందని మండిపడ్డారు. వ్యవసాయ బడ్జెట్ లో రుణాల మాఫీ ఉందా?లేదా?అనేది టీడీపీ స్పష్టం చేయాలన్నారు. వ్యవసాయ బడ్జెట్ పేరుతో ప్రజలను ఊరించడానికి చేస్తున్న మరో ప్రయత్నమే రుణమాఫీ అంశమన్నారు. రాష్ట్రానికి 24 గంట కరెంటు కూడా ఒక బూటకమని విమర్శించారు.
అలా ఇవ్వడానికి అల్లా అద్భుత దీపం ఏమైనా ఉందా?అని నిలదీశారు. నదీజలాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఉత్పత్తి ఆశాజనకం అనుకోవచ్చని, అయితే విద్యుత్ సేకరణ ఎలా చేస్తారో చెప్పకుండా నిరంతర విద్యుత్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వ్యవసాయ రుణాల రీషెడ్యూల్ కు, రుణ మాఫీకి సంబంధం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.