అన్న వస్తున్నాడంటే ఉలుకెందుకు?
విజయవాడ: అన్న వస్తున్నాడన్న వైఎస్ జగన్ నినాదాన్ని అందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి తెలిపారు. అన్ని వర్గాలకు తమ అధ్యక్షుడు పరిష్కారాన్ని చూపించారని అన్నారు. ముందున్నాయ్ మంచి రోజులు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్తామని చెప్పారు. పార్టీ నేతలు జోగి రమేశ్, మేరుగ నాగార్జునతో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్లీనరీ విజయవంతమవడంతో టీడీపీ నేతల బట్టలు తడిసిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్లీనరీతో ప్రజలకు భరోసాయిచ్చామని, టీడీపీ నాయకులు ఎందుకు కలవరపడుతున్నారని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించే ధైర్యంలేక ప్లీనరీలో అభివృద్ధి కోసం ఏమీ మాట్లాడలేదని తమపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములు, ఖనిజ సంపదను దోచుకున్నారని పేర్కొన్నారు. విశాఖలో కొన్ని వేల ఎకరాల భూముల రికార్డులను తారుమారు చేయడం ద్వారా అవినీతి జరిగిందని టీడీపీ వాళ్లే చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాయలసీమలో కరువు తాండవిస్తోందని మీ పేపర్లే రాస్తున్నాయని అన్నారు. ప్రశాంత్ కిశోర్‌ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవడాన్ని టీడీపీ నాయకులు తప్పుబట్టడం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రజాకర్షణ, మహానేత వైఎస్సార్ పథకాల ఆలంబనతో తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని పార్థసారధి విశ్వాసం వ్యక్తం చేశారు.