
మూడు రోజులకే వెయ్యి కోట్లిస్తే నెల రోజులకు ...
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారం దక్కగానే భూముల పిచ్చి పట్టుకుందని, దానికి రైతులను బలిచేయడమే కాకుండా ప్రభుత్వ భూములను సైతం ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు చంద్రబాబు కట్టబెట్టనున్న కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం అటవీ భూములను పార్టీ శ్రేణులతో కలిసి రామకృష్ణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గీ వాసుదేవ్ మూడురోజుల పాటు యోగా పాఠాలు నేర్పినందుకు సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టటానికి చంద్రబాబు సిద్ధమయ్యారని, అదే నెల రోజులు యోగా నేర్పితే విజయవాడ కూడా రాసిస్తారని ఎద్దేవా చేశారు.
భూముల పిచ్చితో ల్యాండ్‌బ్యాంక్ ఏర్పాటుకు 10 లక్షల ఎకరాలు సేకరించడానికి చంద్రబాబు పూనుకున్నట్లు విమర్శించారు. అటవీ భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రామకృష్ణ వెంట మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, రాష్ట్ర రైతుసంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్‌రెడ్డి తదితరులున్నారు.