టీడీపీ వేధింపులకు భయపడొద్దు : జ్యోతుల
కాకినాడ: అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రభుత్వం నుంచి ఎలాంటి దాడులు, బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదని, పార్టీ తరఫున తాము రక్షణ కవచంలా నిలుస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. కాకినాడ గొడారిగుంటలో నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన సిటీ నియోజకవర్గ సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం చంద్రబాబు హయాంలో ప్రత్యర్థ పార్టీలపై జరుగుతోన్న కక్షసాధింపుల వంటి నీచ సంస్కృతిని మున్నెన్నడూ చూడలేదన్నారు. ప్రజల తరఫున పోరాడే జగన్‌తో భవిష్యత్‌లో తన మనుగడకు ప్రమాదం ఉందని భయంతో టీడీపీ ఉందన్నారు. వైఎస్సార్ సీపీని నిర్మాణాత్మకమైనదిగా తీర్చిదిద్దుదామన్నారు.
కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు మాట్లాడుతూ గతంలో జగన్‌ను జైలులో నిర్బధించిన సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందన్నారు. తెలుగుదేశానికి అదే గతి పడుతుందన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన మాటను అమలు చేయకుండా రుణమాఫీపై ముఖం చాటేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. జడ్పీ మాజీ ఛైర్మన్, కాకినాడరూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. జిల్లా ఎస్సీసెల్ ఛైర్మన్ శెట్టిబత్తుల రాజబాబు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ వంటి పోరాటతత్వం కలిగిన నాయకుడన్నారు. జిల్లా ప్రచారకమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, నాయకులు అత్తిలి సీతారామస్వామి, వైఎస్సార్ సీపీ కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడారు.
పవన్‌కల్యాణ్ ఎక్కడ?: ద్వారంపూడి
అన్యాయాన్ని ప్రశ్నిస్తానంటూ ఎన్నికల ముందు ప్రసంగాలతో ఊదరగొట్టిన సినీనటుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నిలదీశారు. చంద్రబాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన ప్రతి ప్రాంతంలోను పవన్ అన్యాయాన్ని ప్రశ్నిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు రైతు, డ్వాక్రా రుణాలు రద్దు సహా చంద్రబాబు హామీలు ఏ ఒక్కటి అమలు కావడం లేదని, ఈ అన్యాయాన్ని ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. సమావేశంలో తొలిత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
చివరగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులై తొలిసారిగా కాకినాడ వచ్చిన జ్యోతుల నెహ్రూను సన్మానించారు. సమావేశంలో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయభాస్కర్, వైఎస్సార్ సీపీ మండలపేట కోఆర్డినేటర్ గిరిజాల వెంకటస్వామినాయుడు, పార్టీ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ , రాష్ట్ర కార్యదర్శి గుండా వెంకటరమణ, జిల్లా వక్ఫ్‌కమిటీ అధ్యక్షుడు అబ్దుల్‌బషీరుద్దీన్, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీలు, కాకినాడ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, పార్టీ నాయకులు దొంగ రామసత్యనారాయణ తదిత రులు పాల్గొన్నారు.