పాపం చిన్నారులు
చిలకపాలెంలో దంపతుల ఆత్మహత్య
అనాధలైన కుమారులు
ఎచ్చెర్ల క్యాంపస్: జెండా పండుగను అందరితో కలిసి ఘనంగా జరుపుకోవాలి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలిచిన బహుమతులు అమ్మానాన్నలకు చూపించాలని భావించి తమ్ముడితో కలిసి గురువారం రాత్రి 9 గంటలలోపే నిద్రకు ఉపక్రమించాడు ఆ కుర్రాడు. కానీ విధి వారి జీవితంతో ఆడుకుంది. ఉదయానే స్కూలుకు వేగిరంగా వెళ్లాలని నిద్ర లేచిన పిల్లలకు ఇంట్లో అమ్మా నాన్న కనిపించలేదు. ఏమయ్యారో ఇరుగుపొరుగు వారిని అడిగితే సరైన సమాధానం రాలేదు. చుట్టుపక్కల వెతికితే ఓ పాడుపడిన బావి దగ్గర తండ్రి సెల్ ఫోన్, కాళ్ల చెప్పులు కనిపించడంతో ఆందోళన చెందారు. బావిలో చూసేసరికి వారి నెత్తిన పిడుగుపడినట్లయింది.
తల్లిదండ్రులిద్దనూ విగతజీవులుగా బావిలో కనిపించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన వారు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే బంధువులకు సమాచారం అందించారు. వివరాలు ఇవీ... లావేరుకు చెందిన వాలపల్లి సత్యనారాయణ (45), సరస్వతి (40)కి 20 ఏళ్ల కిందట వివాహం అయింది. 15 ఏళ్ల కిందట వాళ్లు చిలకపాలెం జంక్షన్‌ను వలస వచ్చారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కల్యాణ్ ఎచ్చెర్లలోని వెంకటసాయి ప్రైవేట్ స్కూల్‌లో 8వ తరగతి, చిన్నకుమారుడు ప్రసాద్ అల్లినగరం ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు.
భార్యాభర్తలిద్దరూ ఇటుకల పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు గానీ, అప్పులు గానీ లేవని బంధువులు చెబుతున్నారు. అయితే మద్యం వ్యసనం ఉన్న సత్యనారాయణ తరచూ భార్య సరస్వతితో గొడవపడుతుండేవాడు. గురువారం రాత్రి 9 గంటలకు పిల్లలిద్దరూ నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఏంజరిగిందో తెలియదుగానీ క్షణికావేశంలో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న జేఆర్‌పురం సీఐ కె.అశోక్‌కుమార్ పిల్లలను విచారణ చేశారు. వారు కూడా దాదాపుగా స్థానికులు, బంధువులు చెప్పిన విషయాలే చెప్పడంతో భార్యాభర్తలది ఆత్మహత్యగా నిర్ధారణకు వచ్చారు.
సత్యనారాయణ దంపతుల ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. సత్యనారాయణ అన్నయ్య లావేరులోను, తమ్ముడు వీరభద్రరావు చిలకపాలెంలోనూ ఉంటున్నారు .విషయం తెలిసి లావేరు మండలం నుంచి బంధువులు తరలివచ్చారు. కాగా పోలీసులు మృతదేహాలను బావిలోకి బయటకు తీయించి శవ పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాపం కల్యాణ్
కల్యాణ్‌కు చురుకైన విద్యార్థిగా పేరుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల స్కూల్‌లో నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీల్లో బహుమతులు కూడా గెలిచాడు. అతిథుల చేతులు మీదుగా బహుమతులు అందుకోవాలని ఎంతో ఆశించాడు. కానీ ఊహించని రీతిలో ఇంట్లో విషాదం నెలకొనడంతో తల్లిదండ్రుల అంత్యక్రియల్లో పాల్గోవాల్సి వచ్చింది. తల్లిదండ్రుల మృతదేహాల ఎదుట కల్యాణ్, ప్రసాద్ గుండలవిసేలా విలపిస్తుంటే వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.