కమలనాథన్ కమిటీకి 3వేల దరఖాస్తులు
ఆంధ్రా ఉద్యోగుల్లో ఎక్కువమంది సొంత రాష్ట్రానికే ఆప్షన్
హైదరాబాద్: శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల పంపిణీకి కమలనాథన్ కమిటీ రూపొం దించిన మార్గదర్శకాలపై ఉద్యోగుల నుంచి దాదాపు మూడు వేల వరకు దరఖాస్తులు వచ్చా యి. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులు చాలామంది స్వరాష్ట్రానికి వెళ్లడానికి ఆప్షన్ ఇవ్వగా, భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్నవారిలో ఎక్కువమంది తెలంగాణలోనే కొనసాగడానికి ఆప్షన్లు ఇచ్చినట్లు సమాచారం. భార్య ఉద్యోగం చేస్తూ, భర్త ఇక్కడ వ్యాపారం చేస్తున్న పక్షంలో.. భార్య స్థానికత ఆంధ్రా అయినప్పటికీ, వారు ఇక్కడే కొనసాగడానికి అవకాశం కల్పించాలన్న దరఖాస్తులు కూడా ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది.
తమ భర్తలు ఇక్కడి ప్రభుత్వానికి చెల్లిస్తున్న వ్యాట్ తదితర పన్నుల రశీదు పేపర్లను కూడా జత చేసినట్లు సమాచారం. పోలీసు అధికారులు కూడా పలు సూచనలు, ఆప్షన్ లేఖలు ఇచ్చారు. ఉద్యోగులు అభ్యంతరాలు, సూచనలు, సలహాలు క్రోడీకరించి కమల్‌నాథన్ కమిటీ తుది మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.