♦ సమస్యలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తా
♦ ఆయనతోనే చంద్రబాబుతో మాట్లాడిద్దాం..
♦ విశాఖపట్నం సదస్సులో అన్నీ చర్చిద్దాం
♦ బీజేపీ నాయకులకు కంభంపాటి హరిబాబు హామీ
సాక్షి, విజయవాడ : నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీశ్రేణులకు ఏమాత్రం అన్యాయం జరిగినా సహించేది లేదని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు హామీ ఇచ్చారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి హాజరైన కంభంపాటి హరిబాబును బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నగరానికి చెందిన సుమారు 50 మంది నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జరిగిన అంతర్గత సమావేశంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని సదరు నేతలు ఏకరువు పెట్టారు. హరిబాబును గట్టిగా నిలదీశారు. దీనికి స్పందించిన ఆయన రాష్ట్రంలో బీజేపీ శ్రేణులకు జరుగుతున్న అన్యాయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తామని, చంద్రబాబుతో మాట్లాడిస్తామని హామీ ఇచ్చారు.
పదవులు భర్తీ అయ్యాక ఏం చేద్దాం?
టీడీపీ మహానాడులోపు నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోందని, పార్టీ నాయకులు కూడా ఎవరికి వారు పదవులు దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారని బీజేపీ స్థానిక నేతలు హరిబాబుకు వివరించారు. పదవులన్నీ భర్తీ అయ్యాక చంద్రబాబుతో మాట్లాడినా ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. పదవుల కోసం చంద్రబాబును నిలదీయాలని, దీనికి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నేతలు సహకరించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో కొన్ని కీలకమైన పదవులతో పాటు ప్రతి కమిటీలోనూ కనీసం రెండు పదవులు బీజేపీ నేతలకు, కార్యకర్తలకు దక్కేలా పట్టుబట్టాలని వారు హరిబాబుకు సూచించారు. బీజేపీకి ప్రాధాన్యత లేకుండా వేసే కమిటీల విషయంలో టీడీపీ అధిష్టానాన్ని నిలదీయాలని వారు సూచించారు.
హరిబాబు హామీల వర్షం
బీజేపీ నాయకులు అడిగిన ప్రశ్నలపై రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. తమకు పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేయడానికి ప్రయత్నిస్తే ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అక్కడ టీడీపీ నేతలకు పదవులు దక్కకుండా చేస్తామంటూ హామీ ఇచ్చారు. బీజేపీ నేతలకు పదవులు ఇచ్చేందుకు అవసరమైతే ప్రత్యేక జీవోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసేలా చూద్దామని చెప్పినట్టు సమాచారం. ఇటీవల బెంగళూరులో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలోనూ బీజేపీ శ్రేణులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించామని తెలిపారు.
ఈనెల 12న వైజాగ్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో రాష్ట్రంలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించడంతోపాటు వారి మనోభావాలను కూడా తెలుసుకుని దానికి తగినట్టుగా తీర్మానాలు చేస్తామని హరిబాబు హామీ ఇచ్చారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి పార్టీ నేతలకు, శ్రేణులకు న్యాయం జరిగేలా చూస్తారన్నారు. హరిబాబుతో చర్చించిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లూరు శ్రీమన్నారాయణ తదితరులున్నారు.
కార్యకర్తలకు న్యాయం జరిగేదెప్పుడు?
ఏళ్ల తరబడి జెండాలు మోస్తున్న వారు పార్టీలో ఉన్నారని, వారికి ఏం న్యాయం జరిగిందని పలువురు నేతలు హరిబాబును ప్రశ్నించారు. పార్టీ సభ్యత్వం కోసం శ్రేణుల వద్దకు వెళితే.. కేంద్రంలో అధికారంలోనూ, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నా పార్టీ కార్యకర్తలకు ఏం ఒరుగుతోందని ప్రశ్నిస్తున్నారని, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామంటూ పలువురు నేతలు హరిబాబుకు వివరించారు. 30 ఏళ్లుగా ఈ పార్టీలో ఉన్నారని, ఏ ఇతర పార్టీలో ఉన్నా ఎంతో కొంత ప్రయోజనం ఉండేదని కార్యకర్తలు తమ వద్ద ఆక్రోశిస్తున్నారని తెలిపారు.
పార్టీశ్రేణులకు న్యాయం చేస్తా
Published Tue, Apr 7 2015 4:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement