కనకదుర్గఘాట్ రోడ్డు వద్ద ట్రాఫీక్‌తో నిలిపోయిన వాహనాలు
అది నిత్యం దాదాపు 57,000 వాహనాలు రాకపోకలు సాగించే రహదారి..
హైదరాబాద్ నుంచి అటు చెన్నై వెళ్లాలన్నా ఇటు కోల్‌కతా వెళ్లాలన్నా అదే మార్గం...
అలాంటి కీలక దారిలో ట్రాఫిక్ ఆంక్షల వల్ల వాహనదారులు దాదాపు 40 కి.మీ. చుట్టూ తిరుగుతూ అల్లాడుతున్నారు. విజయవాడలో మూడేళ్లు అవుతున్నా సర్కారు ఫ్‌లై ఓవర్ పనులను పూర్తి చేయకపోవటంతో నరకం అనుభవిస్తున్నారు. పెరిగిన దూరంతో రవాణా రంగంపై ప్రతి నెలా అదనంగా రూ.34 కోట్ల డీజిల్ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రూ. 450 కోట్లతో చేపట్టిన వంతెన కన్నా వాహనదారులపై పడుతున్న ఇంధన భారమే అధికమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, అమరావతి బ్యూరో: ట్రాఫిక్ కష్టాలను తలచుకుని విజయవాడ రావాలంటేనే లారీ యజమానులు, వాహనదారులు హడలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో పూర్తి చేస్తామన్న కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం మూడేళ్లవుతున్నా ఇంకా పనులు పూర్తి కాకపోవటమే దీనికి కారణం.
ఆ మార్గంలో రోజూ 57 వేల వాహనాలు
విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మిస్తున్న మార్గం ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అత్యంత కీలకమైంది. హైదరాబాద్– మచిలీపట్నం 65వ నంబర్ జాతీయ రహదారిని, చెన్నై– కోల్‌కతా 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానించే కీలకమైన రోడ్డు ఇది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఈ మార్గం నుంచే విజయవాడలోకి ప్రవేశిస్తాయి. అటు చెన్నై వెళ్లాలన్నా ఇటు కోల్‌కతా వైపు వెళ్లాలన్నా ఈ దారి గుండానే ప్రయాణించాలి. విజయవాడలో ట్రాఫిక్ అంశంపై పోలీసు, రవాణా శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2015లో సంయుక్తంగా నిర్వహించిన సర్వే సర్వే ప్రకారం ఈ మార్గంలో నిత్యం 57 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంత కీలకమైన మార్గంలో ఫ్లైఓవర్ నిర్మించాలని 2015లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిలోపే అంటే 2016 ఆగస్టు కృష్ణా పుష్కరాల నాటికే ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు మూడేళ్లు అవుతున్నా పనులను పూర్తి చేయించలేకపోయారు. మూడేళ్లలో నాలుగుసార్లు గడువులు పొడిగించినా పనులు పూర్తి కాలేదు.
చుట్టూ తిరిగి నగరంలోకి...
కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో విజయవాడ శివారులోని గొల్లపూడి నుంచి బెంజ్ సర్కిల్ మార్గంలో మూడేళ్లుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాదాపు ఏడాదిన్నరపాటు ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. దీంతో చుట్టూ తిరిగి విజయవాడలోకి ప్రవేశించాల్సి వస్తోంది. నెహ్రూ బస్‌స్టేషన్ చేరుకునేందుకు దాదాపు గంట పడుతోంది. గొల్లపూడి నుంచి కబేళా జంక్షన్, చనుమోలు వెంకట్రావు ఫ్‌లై ఓవర్, సింగ్‌నగర్, రామవరప్పాడు రింగ్ మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీని వల్ల దూరం పెరిగింది. వాహనదారులకు సమయం కూడా వృథా అవుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే ఇరుకు రోడ్లలో ప్రయాణానికి గంటన్నరకుపైగా సమయం పడుతోంది.
మహానాడులో సీఎంకు ఫ్లైఓవర్ నిర్మాణంపై ‘సాక్షి’ కథనాలను చూపిస్తున్న ఎమ్మెల్యే వర్మ
నెలకు రూ.34 కోట్ల భారం
లారీలు, బస్సులకు దాదాపు 5 లీటర్ల డీజిల్ అదనంగా ఖర్చు అవుతుండటంతో ఒక్కో వాహనంపై రూ.380 దాకా భారం పడుతోంది. ఆ మార్గంలో నిత్యం ప్రయాణించే 57 వేల వాహనాల్లో లారీలు, రవాణా వాహనాలు, బస్సులు దాదాపు 30 వేల వరకు ఉంటాయని అంచనా. అంటే వీటిపై రోజూ రూ.1.14 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.34 కోట్ల ఆర్థిక భారం పడుతుండటంతో రవాణా రంగం కుదేలవుతోంది. ఫలితంగా విజయవాడ రావాలంటేనే లారీ యజమానులు హడలిపోయే పరిస్థితి నెలకొంది. వాహనదారులు, ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నా ఫ్లై ఓవర్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సీఎం చంద్రబాబు సమీక్షలతో హడావుడి చేయడం మినహా వంతెన వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మా బతుకులను దెబ్బతీస్తోంది
ఫ్లైఓవర్ నిర్మాణంలో ప్రభుత్వం చేతగానితనం మా బతుకులను దెబ్బతీస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా సర్వీసులు నడపాలంటే లారీ యజమానులు భయపడుతున్నారు.
– మధు, లారీ సప్లయర్స్ అసోసియేషన్ కార్యదర్శి
డీజిల్ ఖర్చు తడిసిమోపెడు
హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేందుకు మూడు గంటలు పడితే భవానీపురం నుంచి నగరంలోకి రావడానికి సుమారు గంటన్నర పడుతోంది. ట్రాఫిక్‌లో చుట్టూ తిరిగి రావాలంటే డీజిల్ ఖర్చు తడిసిమోపెడవుతోంది. పెరిగిన ఖర్చుతో కిరాయిలు గిట్టుబాటు కావటం లేదు.
– చేపూరి వినయ్, ట్యాక్సీ డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment